ముంబైలోని అంబుజావాడి ప్రాంతంలో సురేంద్ర కుమార్ గున్నార్ అనే వ్యక్తి తన ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని వింటున్నాడు. కాకపోతే అదేదో చిన్నగా తనవరకు వినపడేలా కాకుండా పెద్దగా సౌండ్ పెట్టి సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. అంతలా శబ్ధం వస్తుండడంతో ఆ ఇంటి పక్కనే ఉన్న సైఫ్ అలీ చంద్‌కు కాస్త చికాకు కలిగింది. దీంతో అతను సురేంద్ర కుమార్ వద్దకు వెళ్లి సౌండ్ తగ్గించమని కోరాడు. అందుకు సురేంద్ర కూమార్ ససేమిరా అన్నాడు. అసలే చిరాకు, అందులో అతను సౌండ్ తగ్గించేందుకు అంగీకరించకపోవడంతో సైఫ్ అలీ సురేంద్రపై దాడి చేయడంతో అతను అక్కడే కుప్ప కూలిపోయాడు. కుటుంబ సభ్యులు సురేంద్ర కుమార్‌ను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు సైఫ్ అలీని అదుపులోకి తీసుకున్నారు.
40 ఏళ్ల సురేంద్ర తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. గత బుధవారం రాత్రి ఈ కేసు నమోదైనట్లు సమాచారం. మృతుడు సురేంద్ర కుమార్ గున్నార్ బయట కూర్చుని సంగీతం వింటూ రికార్డర్‌లో బిగ్గరగా సంగీతాన్ని ప్లే చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. సైఫ్ అలీ చంద్ షేక్ (25)కి ఇది ఇష్టం లేదని, అందుకే అలీ సౌండ్ తగ్గించమని కోరగా, సురేంద్ర తిరస్కరించాడు. షేక్ చాలా కోపంగా సురేంద్రని కొట్టడం ప్రారంభించాడు. దీంతో మృతుడు స్పృహతప్పి పడిపోవడంతో పాటు రక్తస్రావమైంది. ఇంతలో, కొందరు అతన్ని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అతను చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ కేసులో నిందితుడిని ఐపిసి సెక్షన్ 302 మరియు సంబంధిత నిబంధనల ప్రకారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.