హన్మకొండలో దారుణం.. నడిరోడ్డుపై ఆటోడ్రైవర్ హత్య
హన్మకొండ నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
By Medi Samrat Published on 22 Jan 2025 9:25 PM ISTహన్మకొండ నగరం నడిబొడ్డున పట్టపగలే ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధం ఈ హత్యకు దారి తీసినట్లు సమాచారం. మృతుడిని వెంటాడిన నిందితుడు అతడిని అతి కిరాతకంగా హత్య చేశాడు. వివరాళ్లోకెళితే.. హన్మకొండ నడిబొడ్డు ఢీమార్ట్ వద్ద పట్టపగలు ఆటో డ్రైవర్‌ను దారుణంగా హత్య చేయగా.. మృతుడిని మడికొండకు చెందిన మాచర్ల రాజ్‌కుమార్‌గా గుర్తించారు పోలీసులు. రాజ్‌కుమార్ ఆటోలో కూర్చొని ఉన్న సమయంలో ఏనుగు వెంకటేశ్వర్లు అనే మరో ఆటో డ్రైవర్ అక్కడకు చేరుకుని.. తనతో తెచ్చుకున్న కత్తితో రాజ్‌కుమార్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. కడుపులో దాదాపు 15 సార్లు కత్తితో పొడిచాడు. దీంతో అతడు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. పక్కనే ఉన్న వ్యక్తులు ఆపేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఆపకుండా పదేపదే పొడిచాడు. రాజ్‌కుమార్ కిందపడినప్పటికీ వదలకుండా గొంతుపై కూడా కత్తితో పొడిచాడు. దీంతో రాజ్‌కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆపై నిందితుడు వెంకటేశ్వర్లు అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలిసిన వెంటనే సుబేదార్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.