దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్య‌క్తిని చికిత్స చేయిస్తామ‌ని తీసుకెళ్లి..

ప్రమాదంలో గాయపడిన నడివయస్కుడ్ని చికిత్స నిమిత్తం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు.

By Medi Samrat
Published on : 28 Aug 2025 8:39 AM IST

దారుణం.. ప్రమాదంలో గాయపడిన వ్య‌క్తిని చికిత్స చేయిస్తామ‌ని తీసుకెళ్లి..

ప్రమాదంలో గాయపడిన నడివయస్కుడ్ని చికిత్స నిమిత్తం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. గాయ‌ప‌డిన ఆ వ్య‌క్తి మూడు గంటలపాటు అక్కడే పడి ఉన్నాడు. సకాలంలో వైద్యం అందక మృతి చెందాడు. ఈ సంఘటన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం గోర‌ఖ్ పూర్ జిల్లా గిడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సెక్టార్-15 మోర్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. సోదరుడి ఫిర్యాదు మేరకు గిడా పోలీస్ స్టేషన్‌లో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గహసద్‌కు చెందిన రాంసింగ్‌ యాదవ్‌ మంగళవారం ఏదో పని నిమిత్తం గిడకు వెళ్లాడు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో తిరిగి వస్తుండగా సెక్టార్-15 మలుపు వద్ద వేగంగా వచ్చిన బైక్‌ ఢీకొట్టింది. ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పాదచారులు ద్విచక్రవాహనదారులను పట్టుకున్నారు. దీంతో రామ్‌సింగ్‌ను చికిత్స నిమిత్తం తీసుకెళ్తామని చెప్పి తమ వెంట తీసుకెళ్లి.. అతడిని మురారి ఇంటర్‌ కళాశాల సమీపంలో రోడ్డుపై వదిలి పారిపోయారు. దాదాపు మూడు గంటల పాటు రామ్ సింగ్ అక్కడే గాయాల‌తో కొట్టుమిట్టాడాడు.

బాటసారుల సమాచారంతో అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు అతడిని సీహెచ్‌సీకి తరలించారు. ఆపై అత‌డి వివ‌రాలు గుర్తించి బంధువులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు రామ్‌సింగ్‌ను జిల్లా ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

గాయపడిన రాంసింగ్‌ను బైక్‌పై తీసుకొచ్చిన‌ వారు చికిత్స చేయించ‌కుండా తోసేసి పారిపోయారని ఆరోపిస్తూ సోదరుడు జైసింగ్ యాదవ్ బైక్ నంబర్ ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.

Next Story