కేవలం 'సరదా' కోసం ఒక మిల్లులో పనిచేసే కార్మికులు రెహ్మత్ అలీ అనే తోటి ఉద్యోగి శరీరంలోకి అతని మలద్వారం ద్వారా గాలిని పంప్ చేసి మరణించేలా చేశారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జరిగింది. సుమారు 10 రోజుల చికిత్స తర్వాత రెహ్మత్ ఆసుపత్రిలో మరణించాడు. పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలో ఉన్న నార్త్ బ్రూక్ జూట్ మిల్లులో నవంబర్ 16న ఈ ఘటన జరిగింది. రెహ్మత్ అలీ రాత్రి షిఫ్ట్‌లో ఉండగా, అతని సహోద్యోగులు అతనిని పట్టుకుని, అతని మలద్వారంలోకి పైపుని చొప్పించి, అతని శరీరంలోకి గాలిని పంప్ చేశారు.
ఆ సమయంలో రెహ్మత్ అలీ ప్రతిఘటించాడు, అయినప్పటికీ అతని తోటి ఉద్యోగులు ఆపలేదు. వెంటనే రెహ్మత్ అలీ ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. ఆ తర్వాత అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతడిని మొదట హుగ్లీలోని చుంచురా ఇమాంబర ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన జరిగిన 10 రోజుల తర్వాత రెహ్మత్ అలీ మరణించాడు. గాలి ఒత్తిడి కారణంగా రెహ్మత్ కాలేయం పూర్తిగా పాడైందని వైద్యులు తెలిపారు.
ఘటన అనంతరం రెహ్మత్ అలీ కుటుంబ సభ్యులు భద్రేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రెహ్మత్ అలీ సహోద్యోగి షాజాదా ఖాన్ ప్రధాన నిందితుడు. మిల్లులో జ్యూట్‌ను ఎయిర్ పంప్‌తో శుభ్రం చేసే బాధ్యత షాజాదాపై ఉంది. రెహ్మత్ కుటుంబానికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే, జూట్ మిల్లు ఈ విషయంపై మౌనం వహిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.