కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గా కాలనీలో విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి సమయంలో స్నేహితులతో కలిసి పొనగంటి వేణు అనే 34 ఏళ్ల వ్యక్తి మద్యం సేవిస్తుండగా పోలీస్ సైరన్ వినబడింది. అక్కడి నుంచి పరిగెత్తిన వేణు.. ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే... వేణు స్వస్థలం మోత్కులగూడెం. జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్న వేణు.. అక్కడే దుర్గా కాలనీలో ఉంటున్నాడు. వేణుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. తనకు వచ్చే కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం రోజు రాత్రి సమయంలో తన స్నేహితులతో కలిసి వేణు ఓ రెస్టారెంట్ ఎదురుగా మద్యం సేవిస్తున్నాడు.
అదే సమయంలో అటుగా పెట్రోలింగ్‌కు వచ్చిన పోలీసులు సైరన్ మోగించారు. దీంతో స్నేహితులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. వేణు పరిగెత్తుకుంటూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డాడు. అక్కడే ఉన్న కొందరు బావిలో ఏదో పడిన శబ్దం వినబడింది. దీంతో వారు బావిలో దూకి గాలించారు. చివరకు కొక్కేలతో ఉన్న బకెట్‌గా తాడు కట్టి వేతకగా.. వేణుకు సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. చాలా సేపటి తర్వాత వేణు మృతదేహన్ని బయటకు తీశారు. అప్పటికే వేణు మృతి చెందాడు. వేణు ప్రమాదవశాత్తు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు వేణు పెద్ద కూతురు విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.