అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు

Man brutally murders mother-in-law over family disputes in Kakinada. బుధ‌వారం తెల్లవారుజామున ఓ వ్యక్తి త‌న‌ అత్తను దారుణంగా హత్య చేశాడు.

By Medi Samrat
Published on : 18 May 2022 3:47 PM IST

అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు

బుధ‌వారం తెల్లవారుజామున ఓ వ్యక్తి త‌న‌ అత్తను దారుణంగా హత్య చేశాడు. కాకినాడ జిల్లా పిఠాపురం విద్యుత్ నగర్‌లో ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మృతురాలి భ‌ర్త‌, కొడుకుకి కూడా గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. విద్యుత్ నగర్‌కు చెందిన రమణమ్మ, సత్యనారాయణ దంపతులు తమ కుమార్తె దివ్యను కొత్త కందారానికి చెందిన సైతన రమేష్‌కి ఇచ్చి ఐదేళ్ల క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. అయితే.. రమేష్ భార్య దివ్య గత ఆరు నెలలుగా తల్లిగారి ఇంట్లోనే ఉంటుంది.

దీంతో భార్యను తనతో పంపాల‌ని అత్తమామలతో రమేష్ గొడ‌వ‌ప‌డ్డా అత‌ని వెంట దివ్య‌ను పంప‌లేదు. ఈ నేపథ్యంలో ఉదయం రమణమ్మ బయట శుభ్రం చేసేందుకు రాగా.. అప్పటికే గేటు బయట ఉన్న అల్లుడు రమేష్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో ఇంట్లో ఉన్న భర్త సత్యనారాయణ, కుమారుడు దిలీప్‌లు రమేష్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే వారిపై కూడా దాడి చేశాడు. రమణమ్మ మెడపై కత్తితో దాడి చేయ‌డంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్త, కొడుకు తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.










Next Story