ఉత్తరప్రదేశ్‌లో జరిగిన దారుణ హత్య వెలుగులోకి వచ్చింది. తనతో లివిన్ ఉంటున్న మహిళ తల నరికి, ఆమె మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పడేసిన కేసులో పోలీసులు ఒక టాక్సీ డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఇంత దారుణ హత్య చేసిన నిందితుడు వివాహం చేసుకోడానికి ఇంటికి వెళ్లాడు. బాధితురాలు ఉమా (30)ను ఆమె ప్రియుడు, టాక్సీ డ్రైవర్ బిలాల్ హత్య చేశాడని, అతను వేరే స్త్రీని వివాహం చేసుకునేందుకు తన సంబంధాన్ని ముగించాలని అనుకున్నాడని పోలీసులు తెలిపారు. ఉమా తల లేని మృతదేహం హర్యానాలోని కలేసర్ జాతీయ ఉద్యానవనం సమీపంలో దొరికింది.
దర్యాప్తు సంస్థల ప్రకారం, డిసెంబర్ 6 సాయంత్రం, బిలాల్ ఉమాను సహారన్పూర్ నుండి స్విఫ్ట్ కారులో తీసుకు వెళ్లి దాదాపు ఆరు గంటలు తిరిగాడు. అతను ఆమెను కాలేసర్ అడవికి దగ్గరగా ఉన్న లాల్ ధాంగ్ లోయ సమీపంలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెను హత్య చేసి, ఆమె తలను నరికి, అక్కడి నుండి పారిపోయాడని పోలీసులు ఆరోపించారు. హత్య తర్వాత బిలాల్ సహారన్పూర్‌లోని తన ఇంటికి తిరిగి వచ్చి, తన పెళ్లి కోసం షాపింగ్ చేయడం ప్రారంభించాడు. ఏమీ జరగనట్లుగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. తరువాత నిందితుడిని అరెస్టు చేశారు, విచారణ సమయంలో నిందితుడు పోలీసులను ఉమా తెగిపోయిన తల దాచిపెట్టిన ప్రదేశానికి తీసుకెళ్లాడు. నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
ఉమా వ్యక్తిగత జీవితంలో వివాదాల కారణంగా సహారన్పూర్‌లో తన కొడుకుతో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె దాదాపు రెండు సంవత్సరాలుగా బిలాల్‌తో సహజీవనం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఆమె ఖర్చులన్నింటినీ భరించాడని, అతని కుటుంబానికి ఆ సంబంధం గురించి తెలియదని ఆరోపించారు. మరో స్త్రీని వివాహం చేసుకోవడానికి బిలాల్ తన సంబంధాన్ని తెంచుకోవాలనుకున్నాడని, ఉమాను తన జీవితం నుండి తొలగించడానికి హత్యకు పథకం వేసాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.