సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని యువతిపై అత్యాచారం
Man assault woman by luring her to work in TV serial. అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన షాకింగ్ కేసు
By Medi Samrat Published on 18 Dec 2021 10:47 AM GMTఅత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని ఫరీదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన షాకింగ్ కేసు ఉత్తరప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది. సీరియల్‌లో అవకాశం ఇప్పిస్తాననే సాకుతో సదరు వ్యక్తి యువతితో మొదట స్నేహం చేశాడు. ఆపై పెళ్లికి హామీ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. డిసెంబర్ 13న సదరు వ్యక్తిపై మహిళ కేసు పెట్టగా.. పోలీసులు 24 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు అమృత్ బీహార్‌కు చెందినవాడు. బాధితురాలు ప్రయాగ్‌రాజ్ నివాసి. ఆమెకు అమృత్‌తో 6 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. అయితే.. అమృత్ తాను ఫిల్మ్ మేకర్న్ అని, సీరియల్స్‌లో అవకాశం ఇప్పిస్తానని ఆ యువతికి చెప్పాడు. అమృత్ మాటలు నమ్మిన యువతి డిసెంబర్ 2, 2021న ఢిల్లీకి వచ్చింది.
ఢిల్లీకి వచ్చిన తర్వాత అమృత్ యువతిని కలుసుకున్నాడు. ఆమె ముందు వివాహ ప్రతిపాదన ఉంచాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని.. అందుకోసం మీ కుటుంబంతో కూడా మాట్లాడతానని అమృత్ యువతితో చెప్పాడు. అందుకు యువతి కూడా అవునని చెప్పింది. దీంతో డిసెంబరు 5న ఫరీదాబాద్ ఎన్‌ఐటీ ప్రాంతంలోని ఓయో హోటల్‌కి మహిళను తీసుకెళ్లాడు అమృత్. అయితే.. ఆ సమయంలో యువతి ఆరోగ్యం కాస్త విషమించింది. దీంతో అమృత్ ఆమెకు టాబ్లెట్‌ను ఇవ్వడంతో యువతి స్పృహతప్పి పడిపోయింది. ఆ తర్వాత అమృత్ యువతిపై అత్యాచారం చేసి పారిపోయాడు. మరుసటి రోజు యువతి అమృత్ కి ఫోన్ చేయగా సమాధానం ఇవ్వకపోగా.. నంబర్‌ను బ్లాక్ చేశాడు. మోసపోయానని గుర్తించిన బాధిత యువతి డిసెంబర్ 13న పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదు మేరకు నిందితుడిపై అత్యాచారం సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.