మహిళకు లిఫ్ట్ ఇచ్చాడు.. నిజ స్వరూపం చూపించాడు
Man arrested for assaulting a woman after giving her lift in Pedakurapadu. గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఆటో కోసం వేచి ఉన్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన
By Medi Samrat Published on 8 Feb 2022 5:07 PM IST
గుంటూరు జిల్లా పెదకూరపాడులో ఆటో కోసం వేచి ఉన్న మహిళకు లిఫ్ట్ ఇచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన సంచలనం రేపింది. అప్రమత్తమైన బాధితురాలు సహాయం కోసం కేకలు వేస్తూ బైక్‌పై నుంచి దూకి పరిగెత్తింది. అయితే దుండగుడు మహిళను వెంబడించి పొలాల్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సత్తెనపల్లి మండలం గార్లపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో బంధువుల ఇంట్లో పూజకు వెళ్లింది. కార్యక్రమం ముగించుకుని తన స్వగ్రామానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అరగంట పాటు వేచి చూసినా వాహనాలు రాలేదు. ఈ సమయంలో ఆమెను పెదకూరపాడుకు తీసుకెళ్తానని నమ్మించి గుర్తుతెలియని వ్యక్తి బైక్ ఎక్కించుకున్నాడు. గమ్యస్థానానికి వెళ్లేందుకు రెండు మార్గాలు ఉండడంతో రద్దీ లేని మార్గంలో తీసుకెళ్లాడు. అనుమానంతో మహిళ ప్రశ్నించగా షార్ట్ కట్ అని చెప్పాడు. అలాగే వెళ్తూ ఆ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడు.
బాధితురాలు వెంటనే బైక్‌పై నుంచి దూకి పాటిబండ్ల వైపు పరుగెత్తింది. దుండగుడు మహిళను పొదల్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో అటుగా వస్తున్న వారు అప్రమత్తమయ్యారు. వారి సహాయంతో బాధితురాలు తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే స్పందించి ఘటనాస్థలికి చేరుకున్నారు. బాధితురాలిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిందితుడి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మహిళ వాంగ్మూలం ప్రకారం చేసి కేసు నమోదు చేశారు.