ఉత్తర మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో తన ఇంట్లోనే ఒక వ్యక్తి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించినందుకు ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ నోట్లను తయారు చేయడం నేర్చుకున్నట్లు పోలీసుల విచారణలో అతడు తెలిపాడు. నిందితుడు జల్గావ్‌లోని కుసుంబ గ్రామంలో ఉంటూ తన నివాసంలోనే ప్రింటింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. "నిందితుడు తన ఇంట్లో నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను ముద్రిస్తున్నాడని జల్గావ్‌లోని MIDC పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఆ తర్వాత పోలీసు బృందం దాడి చేసి గురువారం నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది" అని పోలీసులు చెప్పారు.
1.5 లక్షల రూపాయల విలువ కలిగిన నకిలీ నోట్లను ముద్రించి మారుస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. జల్గావ్ పోలీస్ సూపరింటెండెంట్ (SP) M రాజ్‌కుమార్ PTIతో మాట్లాడుతూ "నిందితుడు యూట్యూబ్‌లో వీడియోలను చూసి నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించడం నేర్చుకున్నాడు. అతనితో మరికొంత మందికి సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నాం" అని అన్నారు. అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరిచారు, మార్చి 9 వరకు పోలీసు కస్టడీకి రిమాండ్ విధించారని పోలీసులు తెలిపారు.