టేబుల్ మీద 7 కోట్ల రూపాయలు

Fake notes worth Rs 7 crore in hands of police.టేబుల్ మీద 7 కోట్ల రూపాయలు.. అచ్చం ఒరిజినల్ నోట్ల లాగే ఉన్నాయి.

By M.S.R  Published on  27 Jan 2022 1:17 PM IST
టేబుల్ మీద 7 కోట్ల రూపాయలు

టేబుల్ మీద 7 కోట్ల రూపాయలు.. అచ్చం ఒరిజినల్ నోట్ల లాగే ఉన్నాయి. అయితే అవన్నీ ఫేక్ నోట్స్ అని పోలీసులు తెలిపారు. నకిలీ కరెన్సీ నోట్లను ముద్రించి పంపిణీ చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠాలోని ఏడుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.7 కోట్ల విలువైన నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. రహస్య ఫిర్యాదు ఆధారంగా, ముంబై క్రైమ్ బ్రాంచ్ యూనిట్-11 మంగళవారం సాయంత్రం దహిసర్ చెక్ పోస్ట్ వద్ద ఓ కారును అడ్డగించింది. అందులో డబ్బుతో పాటూ, కొందరు వ్యక్తులు కూడా పట్టుబడ్డారు. అరెస్టు తర్వాత, నిందితులను స్థానిక కోర్టులో హాజరుపరచగా, జనవరి 31 వరకు పోలీసు కస్టడీ విధించారు.

కారులో కూర్చున్న నలుగురిని పోలీసులు పట్టుకుని విచారించారు. క్రైమ్ బ్రాంచ్ అధికారులు కారులో సోదాలు చేయగా, సుమారు రూ. 5 కోట్ల విలువైన నకిలీ నోట్లను (రూ. 2,000) గుర్తించారు. అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కారులో ఉన్న నలుగురిని విచారించగా వారి మరో ముగ్గురు స్నేహితుల గురించి పోలీసులకు తెలిసింది. అనంతరం అంధేరి (పశ్చిమ)లోని ఓ హోటల్‌పై పోలీసులు దాడి చేసి ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మరికొన్ని నకిలీ నోట్ల కట్టలు (2,000) లభించాయని, వాటి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నేరస్తుల వద్ద నుంచి నకిలీ నోట్లతో పాటు ల్యాప్‌టాప్, ఏడు మొబైల్ ఫోన్లు, రూ.28,170 అసలు నోట్లు, పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముద్రణ, పంపిణీలో అంతర్ రాష్ట్ర ముఠా కార్యకలాపాలు సాగిస్తున్నట్లు విచారణలో తేలిందని డీసీపీ సంగ్రామ్ సింగ్ నిషాందర్ (డిటెక్షన్-1) తెలిపారు. వీరికి ఎవరెవరితో లింక్స్ ఉన్నాయనే దానిపై అధికారులు విచారిస్తూ ఉన్నారు.

Next Story