కర్ణాటక రాజధాని బెంగళూరులో మహిళా సీఐడీ అధికారిణి ఆత్మహత్య చేసుకుంది. నిన్న రాత్రి స్నేహితురాలి ఇంటికి డిన్నర్ కు వెళ్లిన ఆమె.. డిన్నర్ ముగిసిన తరువాత బెడ్‌రూంలోని సీలింగ్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లాలోని మలూరు తాలుకా మాస్తి గ్రామానికి చెందిన లక్ష్మీ(33) కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 2014లో నిర్వహించిన సీఐడీ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించారు. 2017లో ఆమె సీఐడీలో చేరగా.. ప్రస్తుతం పశ్చిమ బెంగళూరులోని అన్నపూర్నేశ్వరి నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో డీఎస్పీగా పని చేస్తున్నారు.
బుధవారం రాత్రి తన స్నేహితురాలు ఇంటికి విందుకు వెళ్లింది. అక్కడ ఓ గదిలోకి వెళ్లి ఎంతసేపటికి బయటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన అక్కడి వారు వెంటనే తలుపులు బద్దలు కొట్టి చూడగా.. లక్ష్మీ ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు డాక్టర్లు నిర్థారించారు. కాగా, ఎనిమిదేళ్ల కిందట వివాహం చేసుకున్న లక్ష్మికి సంతానం కలగలేదు. సంతానం కలుగలేదన్న నిరాశతో లక్ష్మి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అంతేకాకుండా ఆమె ఆత్మహత్యకు ఇతర కారణాలేమైనా ఉన్నాయా..? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.