హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అయితే సహాయక చర్యల్లో మరో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద స్థలంలోని పూర్తిగా కాలిన బస్సును తొలగిస్తుండగా క్రేన్ ఒక్కసారిగా బోల్తాపడటంతో క్రేన్ డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు క్రేన్ ఆపరేటర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి గురైన బస్సు తొలుత డామన్ డయ్యూ (డీడీ01ఎన్9490)లో రిజిస్టర్ చేశారు. ఒడిశాలోని రాయగఢ్ జిల్లాకు చెందిన ప్రైవేటు ఆపరేటర్ వేమూరి కావేరీ ట్రావెల్స్ పేరుతో ఆగస్టు 2018లో డామన్ డయ్యులో దీనిని రిజిస్టర్ చేశారు. యజమాని వేమూరి వినోద్ కుమార్ రాయగఢ్‌లోని సాయిలక్ష్మి నగర్ చిరునామాతో ఈ బస్సును రిజిస్టర్ చేయించారు. వోల్వో మల్టీ-యాక్సెల్ స్లీపర్ కోచ్ అయిన ఈ బస్సుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. డామన్ అండ్ డయ్యులోని సిల్వస్సాలో జారీ చేసిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్, 2027 మార్చి 31 వరకు చెల్లుబాటు అవుతుంది. న్యూ ఇండియా అస్యూరెన్స్ బీమా 2026 ఏప్రిల్ 20 వరకు చెల్లుబాటులో ఉంది.