కుర్లా హత్యాచారం, హత్య : విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి..
Kurla rape, murder case. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబైలోని కుర్లా హత్య, అత్యాచారం కేసులో అరెస్టయి
By Medi Samrat Published on 28 Nov 2021 8:25 PM ISTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబైలోని కుర్లా హత్య, అత్యాచారం కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితులు బాధితురాలి పొత్తికడుపు, ఛాతీపై 26 సార్లు పొడిచి, సుత్తి దెబ్బతో పుర్రె పగలగొట్టారని విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. సుత్తి దెబ్బ వల్ల పుర్రె పగలడమే కాకుండా ఒక కన్ను కూడా బయటకు వచ్చిందని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులు, బాధితురాలి వయస్సు 18-20 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
అయితే నిందితుల్లో ఒకరికి బాధితురాలితో సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. పెళ్లి కోసం బాధితురాలు నిందితుడిని పట్టుబట్టిందని.. నిందితుడు ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టంలేక.. తన స్నేహితుడితో కలిసి ఆమెను వదిలించుకోవడానికి పథకం పన్నాడని పోలీసులు వెల్లడించారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన నేరమని, హత్యకు వాడిన ఆయుధాలను నిందితులు తమ ఇంటి నుంచి తీసుకొచ్చారని పోలీసులు చెబుతున్నారు.
పథకం ప్రకారం.. బాధితురాలిని ఆమె ఇంటి నుంచి హత్య జరిగిన ప్రదేశానికి నిందితులు తీసుకొచ్చారు. నిందితుడి స్నేహితుడు అప్పటికే ఖాళీ భవనం వద్ద వేచి ఉన్నాడు. వారిద్దరూ అక్కడికి చేరుకోగానే బాధితురాలి మెడపై కత్తితో దాడి చేసి గాయపరిచాడని పోలీసులు తెలిపారు. హత్యకు ముందు బాలికపై అత్యాచారం జరిగినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలింది. దీంతో IPC 376, 302 సెక్షన్ ల కింద నిందితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఇతర వ్యక్తుల పాత్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.