సైబర్ నేరాల ఆపరేషన్‌లో సీబీఐకి కీలక విజయం

అంతర్జాతీయ సైబర్ నేరాలపై సీబీఐ భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది.

By -  Knakam Karthik
Published on : 2 Feb 2026 4:17 PM IST

Crime News, National News, Delhi, Cbi, Cyber Crimes, CyStrike

సైబర్ నేరాల ఆపరేషన్‌లో సీబీఐకి కీలక విజయం

అంతర్జాతీయ సైబర్ నేరాలపై సీబీఐ భారీ స్థాయిలో దాడులు నిర్వహించింది. ‘ఆపరేషన్ సైస్ట్రైక్ (CyStrike)’ పేరుతో చేపట్టిన ఈ మల్టీనేషనల్ ఆపరేషన్‌లో కీలక విజయాన్ని సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 2026 జనవరి 30న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో సీబీఐ, అమెరికా ఎఫ్‌బీఐతో పాటు యూకే, కువైట్, ఐర్లాండ్, సింగపూర్ దేశాల చట్ట అమలు సంస్థలతో సమన్వయంగా పనిచేసింది. ఈ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా తెలంగాణతో సహా 10 రాష్ట్రాల్లో ఒకేసారి సోదాలు నిర్వహించారు.

న్యూఢిల్లీ, బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని మొత్తం 35 ప్రాంతాల్లో సీబీఐ బృందాలు రైడ్స్ చేపట్టాయి. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ సహా 15 పట్టణాల్లో ఈ తనిఖీలు జరిగాయి.ఈ దర్యాప్తులో న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ అమెరికా, యూకే, కువైట్, ఐర్లాండ్, సింగపూర్‌కు చెందిన బాధితులను లక్ష్యంగా చేసుకుని సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ప్రధాన సైబర్ నేరగాడిని అరెస్ట్ చేసి, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లు వంటి కీలక డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకుంది.

కువైట్ ఈ-వీసాలు, విదేశీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేసిన మరో స్కామ్ కూడా వెలుగులోకి వచ్చింది. eservicemoi-kw.com అనే డొమైన్‌ను ఉపయోగించి నకిలీ వెబ్‌సైట్ ఏర్పాటు చేసి ఫేక్ ఈ-వీసాలు, నకిలీ ఆఫర్ లెటర్లు పంపినట్లు సీబీఐ గుర్తించింది. ఈ కేసులో ఒక నిందితుడి వద్ద నుంచి రూ.60 లక్షల నగదుతో పాటు నకిలీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

విదేశాల నుంచి వచ్చిన అక్రమ డబ్బును తరలించేందుకు ఉపయోగించిన మ్యూల్ బ్యాంక్ ఖాతాలను సీబీఐ గుర్తించి వాటిని పూర్తిగా బ్లాక్ చేసింది. ఇంటర్‌పోల్ సహా విదేశీ దర్యాప్తు సంస్థలతో కలిసి చేపట్టిన ఈ చర్యలు అంతర్జాతీయ సైబర్ ఆర్థిక ముఠాలకు భారీ దెబ్బగా మారాయని అధికారులు తెలిపారు. టెక్నాలజీ ఆధారిత సంఘటిత నేరాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీబీఐ స్పష్టం చేసింది.

Next Story