కేరళలోని ఇడుక్కి జిల్లాకు చెందిన ఒక మహిళ తన భర్తను డ్రగ్స్ కేసులో ఇరికించేందుకు ప్రయత్నించి జైలు పాలయ్యింది. ఆమెకు సహాయం చేసిన ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. సౌదీ అరేబియాలో నివసిస్తున్న ఆమె ప్రేమికుడిపై కూడా కుట్ర ఆరోపణలపై కేసు నమోదు చేయబడింది. నిందితురాలు 33 ఏళ్ల సౌమ్య అబ్రహం, ఇడుక్కి జిల్లాలోని వందన్మేడు గ్రామ పంచాయతీలో నివసిస్తూ ఉంది. ఆమె తన సహాయకులు 39 ఏళ్ల షానవాస్, 24 ఏళ్ల షెఫిన్ షా తో కలిసి ఆమె భర్త అయిన 45 ఏళ్ల సునీల్ వర్గీస్‌ను మాదక ద్రవ్యాల కేసులో తప్పుగా ఇరికించేందుకు ప్రయత్నించింది. అయితే ఆమె అనుకున్న ప్లాన్ బెడిసి కొట్టడంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భర్తను జైలుకు పంపించేసి సౌమ్య తన ప్రియుడైన వినోద్ అనే 45 ఏళ్ల వ్యక్తితో హాయిగా గడపాలని భావించింది.
ఆమె భర్త వాహనంలో MDMA అనే సైకోయాక్టివ్ డ్రగ్‌ని ఉంచడానికి ప్రయత్నించిందని పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 22న, వందనమెండు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ కరుప్పస్వామి ఆధ్వర్యంలోని జిల్లా యాంటీ నార్కోటిక్స్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్ కు ఒక సమాచారం రావడం.. అతడి బైక్ లో MDMA డ్రగ్ ఉన్నట్లు గుర్తించిన తర్వాత సునీల్ వర్గీస్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు అధికారులు వీఏ నిషాద్ మోన్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కట్టప్పన, ఇన్‌స్పెక్టర్ వీఎస్ నవాస్ సునీల్ ను ఇరికించి ఉండొచ్చని అనుమానించారు. తదుపరి 72 గంటల్లో, వారు సమగ్ర విచారణ తర్వాత నిందితులను అరెస్టు చేశారు. భార్యనే భర్తను ఇరికించడానికి ప్లాన్ చేసిందని తెలుసుకున్నారు. వినోద్‌పై కేసు నమోదు చేసి, అతడిని పోలీసులు భారత్‌కు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.