కేరళ రాష్ట్రంలో మరో దారుణం చోటు చేసుకుంది. మార్చి 17, గురువారం రాత్రి త్రిసూర్‌లో మహిళా వ్యాపారవేత్తను నరికి చంపాడు ఓ వ్యక్తి. మృతురాలు రిన్సీ నాజర్ (30) మన్నారా పరంబు గ్రామానికి చెందినది. ఆమె వస్త్ర దుకాణం నడుపుతోంది. ఆమె తన పిల్లలతో స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, ఆమె మాజీ ఉద్యోగి ఆమెపై దాడి చేశాడు. నిందితుడు రిన్సీ దుకాణంలో గతంలో పనిచేసిన 25 ఏళ్ల రియాజ్ గా గుర్తించారు.
రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రియాజ్ తన బైక్‌పై రిన్సీని వెంబడించి ఆమె స్కూటర్‌ను ఓవర్‌టేక్ చేసి ఢీకొట్టడంతో ఆమె కిందకు పడిపోయింది. ఆ తర్వాత కత్తి తీసుకుని ఆమె ముఖం, చేతిపై దాడి చేశాడు. ఆమె శరీరం నుండి మూడు వేళ్లు వేరు చేయబడ్డాయి. ఆమె శరీరంపై 30 కి పైగా గాయాలు ఉన్నాయని నివేదించబడింది.
చిన్నారుల ఏడుపు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారిని కూడా రియాజ్ బెదిరించాడు. ప్రస్తుతం రియాజ్ పరారీలో ఉన్నాడు. అంతకుముందు, రిన్సీ నివాసంపై దాడి చేసినందుకు వార్నింగ్‌తో పోలీసులు అతన్ని విడిచిపెట్టారు. నిందితుడు టెక్స్‌టైల్ దుకాణానికి వెళ్లి అక్కడ కూడా ఆమెను బెదిరించేవాడు. ఇప్పుడు అతడు ఆమె ప్రాణాలను తీశాడు.