తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం జిల్లాలో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యే అడల్ట్ మూవీలో నటించమని బలవంతం చేశారని ఆరోపిస్తూ 26 ఏళ్ల వ్యక్తి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో సినిమా విడుదలను అడ్డుకోవాలని యువకుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనల కారణంగా తాను ప్రాణాలను వదిలేసే పరిస్థితులు తలెత్తాయని అన్నారు. అతని ఫిర్యాదు మేరకు సినిమా మహిళా దర్శకురాలిపై, ఓటీటీపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు విజింజం పోలీసులు తెలిపారు. "మేము కేసు నమోదు చేసాము. స్టేట్‌మెంట్‌ను నమోదు చేస్తాము. దర్యాప్తు కొనసాగుతోంది" అని పోలీసులు పిటిఐకి తెలిపారు.
టీవీ సీరియల్ పరిశ్రమలో పనిచేస్తున్న వెంగనూరుకు చెందిన వ్యక్తి అగ్రిమెంట్‌పై సంతకం చేయించుకుని మోసం చేశారని ఆరోపించాడు. మహిళా దర్శకురాలు తనను మోసగించి బలవంతంగా అడల్ట్ సినిమాలో నటించేలా చేసిందని ఆరోపించారు. "ఇది నా మొదటి షూట్, నేను అగ్రిమెంట్ సరిగ్గా చదవలేదు, షూటింగ్ ప్రారంభించేందుకు సిబ్బంది హడావిడిగా నన్ను ఒక గదికి తీసుకెళ్లి, ఇది అడల్ట్ మూవీ అని, దానికి అనుగుణంగా నటించాలని చెప్పారు. నేను కుదరదని చెప్పడంతో.. ఒప్పందంపై సంతకం చేశాను కాబట్టి యాక్ట్ చేయాల్సిందేనని బెదిరించారు'' అని ఆయన ఆరోపించారు. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు రూ.5 లక్షలు ఇవ్వాల్సిందేనని చెప్పారన్నారు. "షూటింగ్ జరిగిన ప్రాంతం మారుమూల ప్రదేశంలో ఉన్నందున, నేను పారిపోలేకపోయాను" అని ఆ వ్యక్తి వివిధ టెలివిజన్ ఛానెల్‌లకు చెప్పాడు. స్నేహితుడి ఇంటి నుంచి మీడియాతో మాట్లాడిన వ్యక్తి, సినిమా విడుదలైతే తన కుటుంబం, స్నేహితులను ఎదుర్కోలేనని.. తనకు ఆత్మహత్యే శరణ్యం అని వాపోయాడు.