కర్ణాటకలో ప్రియుడి మరణవార్త విన్న యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే.. ప్రియుడు, అతని స్నేహితుడు ఆత్మహత్య కథ అల్లి యువతితో పెళ్లికి ఆమె తల్లిదండ్రులను అంగీకరించేలా పన్నాగం పన్నినట్లు విచారణలో తేలింది. వివరాళ్లోకెళితే.. సక్కమ్మ, అరుణ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే.. వారిరువురు యువతి కుటుంబాన్ని ఒప్పించలేకపోయారు. దీంతో సక్కమ్మకు తెలియకుండా అరుణ్ తన ప్రెండ్‌తో కలిసి ఓ పథకం వేశాడు. ప్లాన్ ప్రకారం.. అరుణ్ ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఓ కథ అళ్లారు. ఆ ఆత్మహత్యకు సంబంధించిన వార్తను యువతి కుటుంబానికి తెలియజేయడానికి.. సక్కమ్మ బావమరిదికి ఫోన్ చేసి.. తనను తాను పోలీసుగా పరిచయం చేసుకోమని అరుణ్ తన స్నేహితుడు గోపాల్‌కు చెప్పాడు.
అరుణ్ తన ప్రాణాలను తీసుకునేందుకు ప్రయత్నించాడని.. ఆసుపత్రిలో ఉన్నాడని గోపాల్.. సక్కమ్మ బావమరిది ప్రజ్వల్‌తో చెప్పాడు. అరుణ్, సక్కమ్మల పెళ్లికి ఏర్పాట్లు చేయాలని.. లేకుంటే ఆ మహిళ కుటుంబంపై క్రిమినల్ కేసులు పెడతానని ప్రజ్వల్‌ని బెదిరించాడు. ప్రజ్వల్.. సక్కమ్మను పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరడంతో.. అరుణ్ ఆత్మహత్యాయత్నం గురించి సక్కమ్మకు తెలియజేయడంతో వారి పథకం దారి తప్పింది. అరుణ్ ఆత్మహత్య గురించి విన్న సక్కమ్మ ఆత్మహత్యకు పాల్పడింది. అరుణ్ తో ఉన్న బంధాన్ని, కుటుంబం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను పేర్కొంటూ సూసైడ్ నోట్ రాసి తనువు చాలించింది. ఫేక్ ఆత్మహత్య కథనాన్ని వ్యాప్తి చేసి యువతి ఆత్మహత్యకు కారణమైన అరుణ్, గోపాల్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.