భార్య మీద అనుమానం.. 230 కిలోమీటర్లు ప్రయాణించి మరీ హత్య
తన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటక పోలీసు కానిస్టేబుల్ 230 కిలోమీటర్లు
By Medi Samrat Published on 8 Nov 2023 1:13 PM GMTతన భార్యకు అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో కర్ణాటక పోలీసు కానిస్టేబుల్ 230 కిలోమీటర్లు ప్రయాణించి ఆమె గొంతు బిగించి హత్య చేశాడు. హత్య చేశాక కానిస్టేబుల్ పురుగుల మందు తాగాడు. ప్రస్తుతం అతడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 11 రోజుల క్రితమే ఈ దంపతులకు పాప పుట్టింది.
కిషోర్(32) ప్రతిభ(24) లకు నవంబర్ 13, 2022న వివాహం అయింది. 11 రోజుల క్రితమే వారికి ఓ పాప పుట్టింది. ప్రతిభ హోస్కోట్ సమీపంలోని ఆమె అమ్మ ఇంటి వద్ద ఉంది. ప్రతిభకు వివాహేతర సంబంధం ఉందని కిశోర్ అనుమానించేవాడు. ఆమె మెసేజ్‌లు, కాల్ రికార్డులను తరచుగా పరిశీలించేవాడు. ఆదివారం సాయంత్రం కిషోర్ ప్రతిభకు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ప్రతిభ ఫోన్‌లో విలపించడంతో ఆమె తల్లి జోక్యం చేసుకుని కాల్ డిస్‌కనెక్ట్ చేసింది. సోమవారం ఉదయం కిషోర్ తనకు 150 సార్లు ఫోన్ చేసినట్లు గుర్తించిన ప్రతిభ.. తన తల్లిదండ్రులకు ఈ విషయం గురించి చెప్పింది. భార్య ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో కిషోర్ రగిలిపోయాడు. చామరాజనగర్ నుంచి దాదాపు 230 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన కిషోర్ సోమవారం ఉదయం 11:30 గంటల సమయంలో ప్రతిభ తల్లిదండ్రుల నివాసానికి చేరుకున్నాడు. కిషోర్ మొదట పురుగుల మందు తాగి, నవజాత శిశువుతో ప్రతిభ ఉన్న గదిలోకి వెళ్లి తలుపు వేసాడు. చున్నీతో ప్రతిభ గొంతునులిమి హత్య చేశాడు. ప్రతిభ తల్లికి అనుమానం వచ్చి తలుపు తట్టినా స్పందన రాలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత గది బయటకు వచ్చిన కిశోర్ బయటకు వచ్చాడు. పురుగుల మందు తాగిన కిషోర్ కు చికిత్స పూర్తి కాగానే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.