ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదని ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రియుడు కుంగిపోయాడు. పదిహేను రోజులుగా ఆమె తలపులతోనే కాలం గడిపిన యువకడు చివరకు ఆమె వద్దకే వెళ్లిపోయాడు. తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అత్యంత విషాద ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. చేపల వేటకు వెళ్లే రాజా రమేష్ యానాం సావిత్రీ నగర్‌లో ఉండేవాడు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పి తమ ప్రేమను పరిణయంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు అమ్మాయి తల్లిదండ్రులు అడ్డుచెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియురాలు ఈ నెల ఒకటో తేదీన ఆత్మహత్య చేసుకుంది.
అప్పటి నుంచి ప్రియుడు రమేష్ ఎవరితోనూ మాట్లాడకుండా తనలో తనే బాధపడుతూ ఉండేవాడు. ఈ వేదనను భరించలేని రమేష్ తన పిన్నిఇంటికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది చూసిన కుటుంబ సభ్యులు విషయం బయటకు పొక్కక ముందే మృతదేహాన్ని ఖననం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో వివరాలు సేకరించి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పదిహేను రోజుల్లో వ్యవధిలోనే ఆ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడటం అందరి మనస్సులను కలచివేసింది.