హైస్కూల్ బాలికలకు అశ్లీల వీడియోలు చూపించిన ఉపాధ్యాయుడు
హైస్కూల్ బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది
By Medi Samrat Published on 6 Sept 2024 8:00 PM ISTహైస్కూల్ బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీంతో కోపోద్రిక్తులైన తల్లిదండ్రులు టీచర్‌పై విరుచుకుపడ్డారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజునే తల్లిదండ్రులు పాఠశాల ఆవరణలో హంగామా సృష్టించారు. ఇది దాదాపుగా ఘర్షణకు దారితీసింది, కానీ చివరి క్షణంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ జోక్యం చేసుకుని కోపంతో ఉన్న వారిని శాంతింపజేశారు. నిందితుడైన ఉపాధ్యాయుడిపై విద్యా శాఖ అధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
ఈ ఘటన మహాగామ బ్లాక్‌లోని విశ్వస్ఖని పంచాయతీ పరిధిలోని సంగ్రామ్‌పూర్ ఉన్నత పాఠశాలలో జరిగింది. నిందితుడైన అసిస్టెంట్ టీచర్ అన్వరుల్ హోడాపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడు పాఠశాలలో ఉన్నంత వరకూ.. తమ కుమార్తెలను పాఠశాలకు పంపబోమని తల్లిదండ్రులు తెలిపారు. సంగ్రామ్‌పూర్ అప్‌గ్రేడ్ హైస్కూల్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ ఉమాశంకర్.. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారికి లేఖ రాశామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఉపాధ్యాయ దినోత్సవమైన గురువారం సంగ్రామ్‌పూర్‌కు చెందిన డజన్ల కొద్దీ తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాల విద్యార్థినులతో ఉపాధ్యాయుడు అన్వరుల్ హోడా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని.. మొబైల్‌లో అభ్యంతరకర వీడియోలు చూపిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
పాఠశాలలో ఉపాధ్యాయుడి తీరును ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని గ్రామస్థుడు అమిత్ లాల్ తంతి అన్నారు. ఈ విషయమై మహగామ మాజీ ఎమ్మెల్యే అశోక్ భగత్ మాట్లాడుతూ.. సంగ్రామ్‌పూర్ హైస్కూల్‌లో జరిగిన వివాదంపై సమాచారం అందిందని తెలిపారు. విషయం తీవ్రమైనది. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్య పేరుతో ఇలాంటి చర్యలను సమాజం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆమోదించదు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోకుంటే బీజేపీ నిరసన తెలపనుందని చెప్పారు.