విహారయాత్రలో విషాదం.. నీట‌ మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

జార్ఖండ్‌లోని లోత్వా డ్యామ్‌లో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం.

By Medi Samrat  Published on  17 Oct 2023 3:11 PM GMT
విహారయాత్రలో విషాదం.. నీట‌ మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి

జార్ఖండ్‌లోని లోత్వా డ్యామ్‌లో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటన హజారీబాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో 16-17 ఏళ్ల మధ్య వయసున్న ఏడుగురు యువకులు లోత్వా డ్యామ్ వద్ద విహారయాత్రకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అక్కడి డ్యాంలో స్నానం చేస్తుండగా ఆరుగురు యువకులు నీటిలో మునిగి చనిపోయారు. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఒకరి కోసం అన్వేషణ కొనసాగుతోంది. రాంచీ నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించాలని డిమాండ్‌ చేశామని ఎస్పీ రతన్‌ ఛోటే తెలిపారు.

మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్లారని.. వారిలో ఒకరు క్షేమంగా ఉన్నారని జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా తెలిపారు. ఆరుగురిలో ఐదుగురి మృతదేహాలను వెలికి తీయగా.. మరొకరి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులతో టచ్‌లో ఉన్నాం. ఇదొక బాధాకరమైన సంఘటన అని విచారం వ్య‌క్తం చేశారు.

నీటిలో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందినట్లు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ తెలిపారు. మొత్తం ఏడుగురు విద్యార్థులు ఇక్కడికి రాగా వారిలో ఒకరు క్షేమంగా ఉన్నారు. ఐదు మృతదేహాలను వెలికితీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ బృందానికి కూడా సమాచారం అందించాం అని తెలిపారు.

లోత్వా డ్యామ్‌లో స్నానాలు చేస్తుండగా ఆరుగురు పాఠశాల విద్యార్థులు మునిగి చనిపోయారని రాష్ట్ర విపత్తు, ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా తెలిపారు. ఐదుగురు చిన్నారుల మృతదేహాలు లభ్యం కాగా, మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల కుటుంబాలకు మంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. నీటిలో మునిగిపోయిన చిన్నారుల పేర్లు రజనీష్ పాండే, సుమిత్ కుమార్, మయాంక్ కుమార్, ప్రవీణ్ గోప్, ఇషాన్ సింగ్, శివసాగర్. విద్యార్థులందరూ హజారీబాగ్‌లోని మౌంట్ ఎగ్మాంట్ స్కూల్ విద్యార్థులు.. రెండు బైక్‌లపై లోత్వా డ్యామ్‌ను సందర్శించడానికి వచ్చారు.

సిఎం హేమంత్ సోరెన్ స్పందిస్తూ.. 'హజారీ బాగ్‌లోని లోత్వా డ్యామ్‌లో ఆరుగురు చిన్నారులు మునిగిపోయారనే విచారకరమైన వార్త నాకు బాధ కలిగించింది. జిల్లా యంత్రాంగం ద్వారా సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన చిన్నారుల ఆత్మకు శాంతి కలగాలని, ఈ ఘడియలో దుఃఖాన్ని భరించే శక్తిని వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

Next Story