కర్ణాటకలోని విజయపుర జిల్లాలో పట్టపగలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)పై దుండగులు దాడి చేశారు. దుండగుల చేతిలో పిస్టల్స్, కత్తులు ఉన్నాయి. వాటితో బెదిరింపులకు పాల్పడుతూ.. కోటి నగదు, బంగారు ఆభరణాలతో దుండగులు పరారయ్యారు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది. విజయపుర జిల్లా చడ్‌చన్ బ్రాంచ్‌లో దొంగలు పడ్డారు. ఈ సమయంలో భారీగా నగదు, బంగారాన్ని దోచుకెళ్లారని, వాటి విలువ దాదాపు రూ.21 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు వ్యక్తులు ముసుగులు ధరించి బ్యాంకులోకి ప్రవేశించారు. ఖాతా తెరవాలని చెప్పి బ్యాంకులోకి ప్రవేశించారు. ఆ తర్వాత బ్యాంకు మేనేజర్, క్యాషియర్‌తో సహా ఉద్యోగులందరికి తుపాకులు, కత్తులు చూపించి బెదిరించారు. ఆ తర్వాత దొంగలు మొత్తం బ్యాంకు సిబ్బంది చేతులు, కాళ్లు కట్టేశారు. ఈ విషయంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రూ.కోటి నగదు, రూ.20 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దుండగులు దోచుకెళ్లినట్లు అంచనా. బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు నకిలీ నంబర్ ప్లేట్ ఉన్న సుజుకీ ఈవీ వాహనాన్ని చోరీకి ఉపయోగించారు. బ్యాంకులో దోపిడీకి పాల్పడిన తర్వాత నిందితులు మహారాష్ట్రలోని పంఢర్‌పూర్ వైపు పరారయ్యారు. ఈ వ్యవహారం విచారణలో ఉంది. నిందితులను పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.