ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్ (IIT-M) కాలేజీ క్యాంటీన్‌లోని ఒక కార్మికుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. క్యాంపస్‌లో రెండవ సంవత్సరం విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు మంగళవారం నాడు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూలై 24 న, IIT-Mలోని న్యూ అకడమిక్ కాంప్లెక్స్ (NAC) సమీపంలో కార్మికుడు విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
బాలిక తన సైకిల్‌పై తన హాస్టల్‌కు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆమె తప్పించుకుని అక్కడి నుంచి బయటపడింది. రెండు రోజుల తర్వాత బాధితురాలి స్నేహితుడు ఈ విషయాన్ని యాజమాన్యానికి తెలియజేశాడు. తక్షణమే దర్యాప్తు ప్రారంభించామని IIT-M ఒక ప్రకటనలో తెలిపింది. తాము సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, విద్యార్థిని ఇచ్చిన వివరణతో సరిపోలిన దాదాపు 300 మంది వ్యక్తుల చిత్రాలను పోల్చి చూశామని చెప్పారు.
CCTV చిత్రాల ఆధారంగా మంగళవారం నాడు బీహార్‌లోని నవాడా జిల్లాకు చెందిన చందన్ కుమార్ అనే క్యాంటీన్ కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని సైదాపేట జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరచగా పోలీసులు రిమాండ్‌కు తరలించారు.