అవకాడో సరఫరాదారులుగా నటిస్తూ సైబర్ మోసగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఒక విద్యార్థి నుండి రూ.2.6 లక్షలు లాగేశారు. బాధితుడు ఆన్‌లైన్‌లో తాజా అవకాడోల కోసం వెతికాడు. అతనికి ఒక నంబర్ కనిపించి ఆ నెంబర్ ని సంప్రదించాడు. వ్యాపారుల లాగా నటిస్తూ ఒక మోసగాడు మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుండి రవాణా ఛార్జీలను కవర్ చేయడానికి డబ్బులు పంపించమని విద్యార్థిని అడిగాడు.
23 ఏళ్ల విద్యార్థి మోసగాడి మాటలను నమ్మి డబ్బులను బదిలీ చేశాడు. ఇంతలో వాహనం ప్రమాదానికి గురైందని, మరమ్మతు ఛార్జీలుగా మరిన్ని డబ్బులు కావాలని కోరాడు. ఇలా వివిధ సాకులతో విద్యార్థిని మోసం చేస్తూనే వచ్చాడు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.