Hyderabad: జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ములుపులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
By అంజి Published on 24 Jan 2024 7:54 AM GMTHyderabad: జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి గాయాలు
హైదరాబాద్ నగరంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలోనే పోలీస్ శాఖ దీనిపై దృష్టి పెట్టింది. ట్రాఫిక్ ఉన్నతాధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా కూడా యువతలో మాత్రం మార్పు రావడం లేదు మితిమీరిన వేగం డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని పోలీసులు అంటున్నారు. తాజాగా నగరంలోని పెద్దమ్మ గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఈరోజు తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన యువకుడు పబ్బులో బౌన్సర్ గా పని చేస్తున్న లింగాల తారక్ రామ్ గా పోలీసులు గుర్తించారు.
అయితే జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ వద్ద ఒక ఆడి కారు బీభత్సం సృష్టిస్తూ మితిమీరిన వేగంతో వచ్చి బైకును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తారక్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక బౌన్సర్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తీవ్ర గాయాలైన అతడిని స్థానిక హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత కారు ఆపకుండా పారిపోయిన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్తున్నారు. కారు ప్రయాణించిన రూట్ సిసి ఫుటేజ్ ను పోలీసులు రికవరీ చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా చేసుకొని కారు డ్రైవర్ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.
ఈరోజు ఉదయం జరిగిన సంఘటన గురించి తెలియగానే వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల రాష్ డ్రైవింగ్ కేసుల దర్యాప్తు మీద సమీక్షించారు. అంతేకాకుండా అనుమతి లేకుండా నడుపుతున్న పబ్ ల మీద తీసుకుంటున్న చర్యల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇటీవల అమ్యూజ్ మెంట్ లైసెన్స్ లేకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు పబ్స్ మీద కేసులు నమోదు చేశారు.. లైసెన్స్ లేకుండా మ్యూజిక్ పెడుతున్న పబ్బుల పై.. మైనర్లను అనుమతించిన.. నియమ నిబంధనలు పాటించకున్నా.. నియమించిన టైంకు మించి పబ్బులు నడిపినా, అట్టి పబ్బుల పై తక్షణమే చర్యలు తీసుకోవాలని వెస్ట్ జోన్ డిసిపి విజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.