కువైట్ నుంచి వచ్చిన నా భార్య కనిపించడం లేదు
Husband Reports Police to his Wife missing. ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి గన్నవరం వచ్చిన తన భార్య కనిపించడం
By Medi Samrat Published on 20 Dec 2020 3:32 PM IST
ఉపాధి కోసం కువైట్ వెళ్లి తిరిగి గన్నవరం వచ్చిన తన భార్య కనిపించడం లేదని ఓ భర్త పోలీసులను ఆశ్రయించాడు. అయితే.. ఆమె వస్తున్న విషయం సదరు భర్తకు తెలీదు. భార్య స్నేహితురాలు ఇచ్చిన సమాచారంతో.. ఆమె స్వదేశానికి వచ్చినట్లు తెలుసుకున్న భర్త.. పోలీసులను ఆశ్రయించాడు. మహిళ అదృశ్యం కావడం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం నెలమూరులో దుర్గ(32), సత్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఓ కుమారై, కుమారుడు ఉన్నాడు. దుర్గ ఉపాధి కోసం కువైట్ వెళ్లింది. ఆమె ఈ నెల 16న కువైట్ నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంది. కానీ దుర్గ ఇంటికి రాకపోవడంతో.. ఆందోళన చెందిన ఆమె భర్త సత్యనారాయణ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నెల 17న రాత్రి 11 గంటలకు ఆమె స్నేహితులి ఫోన్ నుంచి దుర్గ క్షేమంగా ఇంటికి వచ్చిందా అనే సందేశం వాట్సాప్ ద్వారా వచ్చినట్లు సత్యనారాయణ పోలీసులకు చెప్పాడు.
భార్య వస్తున్నట్లు తనకు సమాచారం లేదన్నాడు. గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి సీసీ టీవీ పుటేజ్ పరిశీలించగా.. ఆమె వచ్చినట్లు గుర్తించారు. విమానం దిగిన తరువాత బ్యాగ్‌లు తీసుకుని బయటకు వస్తున్న దృశ్యాలు అందులో కనిపించాయి. అయితే.. ఎయిర్ పోర్టు బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో ఆమె ఏ వాహనం ఎక్కింది..? ఎటు వైపు వెళ్లింది అన్న దానిపై స్పష్టత లేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.