ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు బయలు దేరిన భార్య.. హత్య చేసిన భర్త
Husband Killed Wife. కొంతకాలం క్రితం ఆ ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. తరువాత వారిమధ్య మనస్పర్థలు రావడంతో
By Medi Samrat Published on 19 Dec 2020 10:45 AM IST
కొంతకాలం క్రితం ఆ ఇద్దరూ ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. తరువాత వారిమధ్య మనస్పర్థలు రావడంతో విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరుచుకుంది. భర్తతో విడాకులకు సిద్దమైంది. ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్‌కు బయలు దేరింది. విషయం తెలిసిన భర్త.. నడిరోడ్డుపై కాపు కాసి దాడికి పాల్పడి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం జట్లపాలెం రహదారిపై జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గణపవరం మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన దువ్వారపు చంటియ్య, మొయ్యేరుకు చెందిన బేతిన చంద్రిక (24) లు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం వీరి సంసారం సజావుగా సాగింది. తరువాత ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. దీంతో చంద్రిక ఆరు నెలల క్రితం పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా చంద్రికకు ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కొమ్ము జెర్సీతో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఆ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఆ తర్వాత భర్తను వదిలి అతడితో కలిసి గొల్లగూడెం గ్రామంలో నివసిస్తుంది.
పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భర్త నుంచి విడిపోదాం అనుకుంది. భర్తపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి విడాకులు తీసుకునేందుకు గొల్లగూడెం నుంచి మొయ్యేరుకు ప్రియుడితో కలిసి ద్విచక్రవాహానం పై బయలు దేరింది. విషయం తెలిసిన భర్త.. దారిలో వారిని అడ్డగించి వాగ్వాదం పెట్టుకున్నాడు. తనతో తెచ్చుకున్న కత్తితో చంద్రిక మెడపై నరికి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన చంద్రిక అక్కడిక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.