కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి హత్య
Husband Kill Wife. కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడో భర్త.
By Medi Samrat
కోర్టు ఆవరణలోనే భార్య గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడో భర్త. అయితే ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి పంపించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన సంఘటన కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లా హోలెనరసీపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. చైత్ర (32) హత్యకు గురైన మహిళగా గుర్తించారు, శివకుమార్ ఈ హత్యకు పాల్పడ్డాడు. హోలెనరసీపూర్ తాలూకా, తట్టేకెరె గ్రామానికి చెందిన శివకుమార్, చన్నరాయపట్నం తాలూకా నుగ్గెహళ్లి హోబలి అవెరహళ్లి గ్రామానికి చెందిన చైత్రకు 7 ఏళ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, వారి వైవాహిక జీవితంలో గొడవలు ఎక్కువవ్వడం శివకుమార్ మూడేళ్ల క్రితం విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
భరణం కోరుతూ చైత్ర కోర్టును ఆశ్రయించింది. హోలెనరసీపూర్ కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించగా, న్యాయమూర్తి దంపతులను ఒప్పించి కలిసి జీవించమని చెప్పారు. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని రమ్మని పంపించారు. ఈ సమయంలో చైత్ర తన కుమార్తెను టాయిలెట్‌కు తీసుకెళ్లింది. ఆమెను వెంబడించిన శివకుమార్ టాయిలెట్‌లో కత్తితో భార్య గొంతు కోసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కుప్పకూలిపోయి రక్తమోడుతున్న చైత్రను చూసిన లాయర్లు, కోర్టు సిబ్బంది వెంటనే ఆమెను హోలెనరసీపూర్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే పారిపోతున్న శివకుమార్‌ను వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. చైత్రకు హోలెనరసీపూర్ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించి.. అంబులెన్స్‌లో హాసన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరిన కొద్ది నిమిషాల్లోనే చైత్ర తుది శ్వాస విడిచింది.