గోదావరి ఒడ్డున భార్య చెప్పులు.. అనుమానంతో నదిలోకి దూకిన భర్త.. బంధువుల ఇంట ప్రత్యక్ష్యం అయిన ఇల్లాలు
Husband Commits Suicide in Godavari Due to Wife Missing. దంపతులిద్దరూ రాత్రి 11 గంటల వరకు టీవీ చూశారు.
By Medi Samrat Published on 15 Dec 2020 2:07 PM ISTదంపతులిద్దరూ రాత్రి 11 గంటల వరకు టీవీ చూశారు. ఇద్దరూ నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారు జామున రెండు గంటలకు నిద్ర లేచి చూస్తే.. భార్య కనిపించలేదు. దీంతో కంగారు పడిన భర్త.. భార్య కోసం గాలించాడు. ఆమె చెప్పులు గోదావరి నది ఒడ్డున దొరికాయి. దీంతో భార్య గోదావరి నదిలో దూకిందని భావించిన భర్త.. మరో ఆలోచన చేయకుండా నదిలో దూకి గల్లంతయ్యాడు. అయితే.. భార్య మాత్రం బంధువుల ఇంటి వద్ద ప్రత్యక్షమైంది. ఈఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం గ్రామంలో యర్రంశెట్టి వెంకట రవికుమార్(28)కు మూడేళ్ల కిత్రం పుష్పశివతో వివాహామైంది. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. రవికుమార్ తాపీ పని చేసుకుంటూ భార్యను పోషిస్తున్నాడు. ఆదివారం రాత్రి 11గంటల వరకు వారిద్దరూ టీవీ చేశారు. వారిద్దరి మధ్య ఏం జరిగిందో తెలీదు కానీ.. తెల్లవారు జామున లేచి చూసిన రవికుమార్‌కు భార్య పుప్ష ఇంట్లో కనిపించలేదు. పైగా ఆమె మెడలో ఉండాల్సిన మంగళ సూత్రం ఇంట్లో ఉంది. దీంతో అతడు కంగారు పడ్డాడు.
భార్య ఆచూకీ కోసం ఊరంతా వెతికాడు. గోదావరి నది ఒడ్డున అతడికి భార్య చెప్పులు కనిపించాయి. వాటిని తీసుకుని ఇంటికి వచ్చిన అతను.. తల్లికి చూపించి అవి తన భార్యవేనని నిర్ధారించుకున్నాడు. భార్య గోదావరి నదిలో దూకిందని బావించి.. వెంటనే బైక్ తీసుకుని నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాశర్లపూడి బ్రిడ్జి వద్దకు చేరుకున్నాడు. అక్కడ బైక్‌ను వదిలేసి నదిలోకి దూకేశాడు. స్థానిక మత్య్సకారులు చూసి అతడి రక్షించే ప్రయత్నం చేసినా.. అతడు గల్లంతయ్యాడు. వారిచ్చిన సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాగా.. పుష్ప ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాలకొల్లులోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆమె గతంలో కూడా ఓ సారి ఇలాగే అదృశ్యమైందని స్థానికులు తెలిపారు. జనవరి 20న తిరుపతి వెళ్లి బాబుకు పుట్టు వెంట్రుకలు తీయించటానికి టికెట్లు కూడా బుక్ చేసుకున్నారు. ఇంతలో ఇలా జరగటం ఆఇంట విషాదాన్ని నింపింది.