స్కూలుకు మంచి పేరు రావాలంటే నరబలి ఇవ్వాలా..? 2వ తరగతి బాలుడిని చంపారు కదరా..
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 2వ తరగతి విద్యార్థిని చేతబడిలో భాగంగా చంపేశారు.
By Medi Samrat Published on 27 Sept 2024 4:44 PM ISTఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో 2వ తరగతి విద్యార్థిని చేతబడిలో భాగంగా చంపేశారు. పాఠశాలకు మంచి పేరును తీసుకుని రావాలంటే నరబలి ఇవ్వాల్సిందేనని భావించి బాలుడిని హత్య చేశారు. సెప్టెంబర్ 22న హాస్టల్ గదిలోనే ముగ్గురు వ్యక్తులు బాలుడిని గొంతు నులిమి హత్య చేశారు. పాఠశాల యాజమాన్యం, బాలుడి తండ్రి క్షుద్ర పద్ధతుల్లో నిమగ్నమై ఉన్నారని.. 'నరబలి'కి ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు మరో బాలుడితో కలిసి సెప్టెంబర్ 6న నరబలి చేయాలని అనుకున్నారు. అయితే ఓ బాలుడు పారిపోవడంతో ప్లాన్ బెడిసికొట్టింది. సెప్టెంబరు 22న, నిందితుడు పాఠశాల వెనుక ఉన్న బోరు బావి దగ్గర బాధితుడిని బలి ఇవ్వాలని అనుకున్నారు. బాలుడిని అక్కడికి తీసుకెళ్తుండగా ఇంతలో మేల్కొన్నాడు. ఆ తర్వాత అనుమానితులు భయాందోళనకు గురై పాఠశాలలోనే గొంతు నులిమి హత్య చేశారు.
తదుపరి పరిశోధనలో బోరు బావి దగ్గర చేతబడికి ఉపయోగించే పలు పదార్థాలను కనుగొన్నారు. మూఢనమ్మకాలతోనే ఈ హత్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాఠశాలను అందులో నుండి బయటకు తీసుకుని రావాలనే ఈ హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యమన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు హత్రాస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిపున్ అగర్వాల్ ధృవీకరించారు. ఐదుగురిని అరెస్ట్ చేశాం అని అగర్వాల్ తెలిపారు.