దక్షిణ ఢిల్లీలోని లజ్‌పత్ నగర్‌లో బుధవారం రాత్రి ఒక మహిళ, ఆమె కొడుకు దారుణంగా హత్యకు గురయ్యారు. జూలై 2న రాత్రి 9:43 గంటల ప్రాంతంలో మృతురాలి భర్త కుల్దీప్ సెవానీ తన భార్య, కొడుకుకు పదే పదే ఫోన్లు చేసినా ఎలాంటి సమాధానం లేకపోవడంతో పోలీసు అధికారులను సంప్రదించాడు. ఇంటి మెట్లపై, గేటుపై రక్తపు మరకలు ఉన్నట్లు కూడా కుల్దీప్ సెవానీ గమనించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)తో సహా పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకుని తాళం వేసి ఉన్న తలుపును పగలగొట్టి చూడగా, రుచికా సెవానీ (42), ఆమె 14 ఏళ్ల కుమారుడు నిర్జీవంగా పడి ఉన్నారు. రుచిక బెడ్ రూంలో చనిపోయి ఉండగా, ఆమె కొడుకు మృతదేహం బాత్రూంలో ఉంది. ఇద్దరి మీద పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.
రుచిక సెవానీ తన భర్తతో కలిసి లజ్‌పత్ నగర్ మార్కెట్‌లో ఒక బట్టల దుకాణం నిర్వహిస్తుంది. వారి కుమారుడు 10వ తరగతి చదువుతున్నాడు. ప్రధాన నిందితుడు ముఖేష్ (24) బీహార్‌కు చెందినవాడు. సమీపంలోని అమర్ కాలనీలో నివసిస్తున్నాడు. అతడిని దుకాణంలో డ్రైవర్, సహాయకుడిగా నియమించుకున్నారు. అతడు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ముకేష్ హత్యలను చేసినట్లు అంగీకరించినట్లు తెలుస్తోంది. రుచిక ఇటీవల తిట్టిన కారణంగానే పగ పెంచుకుని, చంపేసినట్లుగా అతను దర్యాప్తు సంస్థలకు చెప్పాడు.