తిరుపతిలో దారుణం.. కన్నబిడ్డను గొంతు నులిమి చంపిన తండ్రి.. మత్తు మందు ఇచ్చి..
Honor killing in Tirupati.. The father who killed his daughter.. This is the original twist. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన యువతి సూసైడ్ కేసు ఒక్కసారిగా మలుపు
By అంజి Published on 2 Dec 2022 3:24 PM ISTతిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన యువతి సూసైడ్ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఐదు నెలల క్రితం చనిపోయిన యువతి చావు మిస్టరీని ఫోరెన్సిక్ రిపోర్టులు బయటపెట్టాయి. యువతి ఆత్మహత్య కాదు.. హత్య అని తెలిసింది. యువతిని చంపింది కూడా అతని తండ్రేనని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రెడ్డివారిపల్లెకు చెందిన మోహన కృష్ణ (19) అనే యువతికి ఇంటర్ చదువుతోంది. ఈ క్రమంలోనే పక్క గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది.
వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత అతడిని మ్యారేజ్ చేసుకుంటానని ఇంట్లో వారికి చెప్పింది. అయితే తల్లిదండ్రులు యువతి పెళ్లికి అంగీకరించలేదు. ఆ తర్వాత ఏమైందో ఏమోనని.. గత జులై 7న మోహన కృష్ణ ఆత్మహత్య చేసుకుంది అని గ్రామస్తులు, బంధువులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు. అదే సమయంలో యువతి మృతిపై పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇటీవల పోస్టుమార్టం రిపోర్టు పోలీసులకు చేరింది.
పోస్టుమార్టం రిపోర్టులో మోహన కృష్ణ ఆత్మహత్య చేసుకోలేదని, గొంతు నులిమి హత్య చేశారని ఉంది. చనిపోవడానికి ముందు ఆమెకు మత్తు ఇచ్చారని తేలింది. దీంతో ఈ ఘటనపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేశారు. హత్యకు గురైన యువతి తల్లి చనిపోయింది. అప్పటి నుంచి ఆమె తన బాబాయ్ కుటుంబంతో కలిసి ఉంటోంది. ఈ క్రమంలో తండ్రి, బాబాయ్, ఇతర కుటుంబ సభ్యుల సహకారంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పక్క గ్రామానికి చెందిన వేరే కులం యువకుడితో పెళ్లి ఇష్టం లేక కుటుంబ సభ్యులే హత్య చేశారని గ్రామస్తులు చెబుతున్నారు.
కూతురి ప్రేమ వ్యవహారాన్ని తట్టుకోలేక తండ్రి మునిరాజా ఇంట్లో హత్య చేశాడని, ఆ తర్వాత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని నాటకం ఆడాడని అనుమానిస్తున్నారు. ఈ కేసులో పలువురు అనుమానితుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. యువతి హత్య తర్వాత ఆమె ప్రియుడిని కేసులో ఇరికించేందుకు ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు గుర్తించారు. ప్రియుడు మోసం చేయడంతోనే ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి.