ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో హిందీ పేపర్ సరిగా రాయకపోవడంతో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తాను సరిగా రాయలేదని విద్యార్థిని భావించి తీవ్ర ఒత్తిడికి గురైంది. ఈ కేసు హరియావ పోలీస్ స్టేషన్ పరిధిలోని పురేల గ్రామానికి చెందినది. మరణించిన విద్యార్థిని పూజగా గుర్తించారు. ఆమె వయస్సు 17 సంవత్సరాలు. పూజ తన ముగ్గురు సోదరీమణులలో రెండవది. ఇద్దరు సోదరులు కూడా ఉన్నారు. గురువారం ఆమెకు ఇంటర్ ఉత్తరప్రదేశ్ బోర్డ్ పరీక్ష హిందీ పేపర్ రాసింది. ఇంటికి వచ్చిన పూజ కంగారుపడుతూ కనిపించింది. పరీక్ష ఎలా రాశావు అంటూ పూజను కుటుంబ సభ్యులు అడిగితే సరిగా రాయలేదని చెప్పింది. దీంతో కంగారు పడాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులు ఆమెకు వివరించారు.
అయితే ఆమె మాత్రం పరీక్ష సరిగా రాయలేదనే ఆందోళనలోనే ఉంది. దీంతో రాత్రి గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూజ తల్లి ఏదో పని నిమిత్తం గదికి వెళ్లగా, ఆమె గట్టిగా అరవడం మొదలు పెట్టింది. దీంతో కుటుంబ సభ్యులు కూడా అక్కడ గూమిగూడారు. విషయం తెలిసిన వెంటనే, ఇరుగుపొరుగు వారు కూడా అక్కడకు చేరుకున్నారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.