1992 నుండి దొంగతనాలు చేస్తూ చివరికి చిక్కాడు..!
హైదరాబాద్ పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక దొంగను అరెస్టు చేశారు.
By Medi Samrat
హైదరాబాద్ పోలీసులు వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక దొంగను అరెస్టు చేశారు. 1992 నుండి 150 ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. అరెస్టు చేసిన వ్యక్తి మహమ్మద్ సలీమ్ అలియాస్ సునీల్ శెట్టి అలియాస్ ఇబ్రహీం అలియాస్ సెట్టి సలీమ్ (52) నుండి దాదాపు 83 గ్రాముల బంగారం, 600 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అందే శ్రీనివాసరావు తెలిపారు. సంతోష్ నగర్ నివాసి అయిన మహమ్మద్ సలీమ్ నుండి ఈ ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గతంలో సలీం ఫలక్‌నుమాలోని నవాబ్ సబ్ కుంటలో నివసించేవాడు. ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్‌లో సిటీ డోసియర్ క్రిమినల్ గా ఉన్న సలీం, నిత్యం ఇళ్ల దొంగతనాలకు పాల్పడేవాడని, 1992 నుండి దాదాపు 150 దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. జూలై 2024లో, బండ్లగూడ పోలీసులు అతన్ని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపారు.
డిసెంబర్ 2024లో, అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. సలీం మళ్ళీ బండ్లగూడ మరియు బాలాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో రాత్రిపూట దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. అప్పటి నుండి పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడిపై నిఘా పెట్టి ఎట్టకేలకు చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ వద్ద MBNR క్రాస్‌రోడ్స్‌లో అరెస్టు చేశారు.