హర్యానాలోని ఒక ఎక్సైజ్ అధికారి మంత్రి ఫంక్షన్ కోసం స్కాచ్ విస్కీ బాటిల్స్ పంపమని మద్యం దుకాణం ఉద్యోగిని కోరుతున్న ఆడియో వైరల్ అయింది. దీంతో ఆ అధికారిపై చర్యలు తీసుకున్నారు. డిపార్ట్‌మెంట్ ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ విషయాన్ని మద్యం దుకాణం యజమాని ముఖ్యమంత్రి గ్రీవెన్స్ సెల్ కు నివేదించారు.
ఆడియోలో ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ సందీప్ లోహన్.. మద్యం దుకాణం (బక్తావర్ చౌక్, సెక్టార్ 47) ఉద్యోగికి ఫోన్ చేసి మంత్రి గారికి సంబంధించి ఓ ఫంక్షన్ జరుగుతోందని.. 15 ఏళ్ల నాటి 'గ్లెన్‌ఫిడిచ్' విస్కీని ఆరు బాటిళ్లను మంత్రి ఉన్న హోటల్‌కు పంపమని కోరినట్లు వినిపించింది. మద్యం షాపు యజమాని అడుగుతున్న విస్కీ అందుబాటులో లేదని చెప్పడంతో లోహన్‌కు కోపం వచ్చింది. మరుసటి రోజు లోహన్ దుకాణానికి చేరుకుని, మద్యం దుకాణం ఉద్యోగిపై దుర్భాషలాడాడు. దుకాణాన్ని మూసివేయమని బలవంతం చేసాడు. ఔట్‌లెట్ యజమాని అనూజ్ ఎక్సైజ్ కమిషనర్ కు విషయాన్ని చెప్పగా.. లోహన్‌పై ఎటువంటి చర్య తీసుకోలేదు. అనూజ్ ఫిర్యాదును సిఎం విండో (గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్), విజిలెన్స్ డిపార్ట్‌మెంట్, హోం మంత్రి, ఇతర అధికారులకు పంపాడు. అప్పుడు సందీప్ లోహన్ పై చర్యలు తీసుకున్నారు.
పంచకులలోని ప్రధాన కార్యాలయానికి లోహన్ బదిలీ అయినట్లు జిల్లా ఎక్సైజ్, టాక్సేషన్ కమిషనర్ రవీందర్ సింగ్ ధృవీకరించారు. "విషయం మా దృష్టికి వచ్చిన తర్వాత, ఇన్‌స్పెక్టర్‌ను గురుగ్రామ్ లో విధుల నుండి తొలగించారు. ఈ కేసును అసిస్టెంట్ ఎక్సైజ్, టాక్సేషన్ ఆఫీసర్ విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తారు. విచారణ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటారు" అని రవీందర్ సింగ్ చెప్పారు.