రాయ్‌పూర్ విమానాశ్రయం బయట కొందరు మహిళలు ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా కొట్టారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాయ్‌పూర్‌లోని స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఆదివారం నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. కోపంతో ఉన్న మహిళలు ఆ వ్యక్తిని బెల్ట్‌తో కొట్టడం, పదేపదే చెంపదెబ్బలు కొట్టడం గమనించవచ్చు. అతను వారి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. వారు ఆ వ్యక్తి చొక్కా కూడా చించివేశారు.ఈ ఘటనపై ఇరువర్గాలు రాయ్‌పూర్ నగరంలోని మనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగింది.
మహిళల చేతుల్లో దెబ్బలు తిన్న వ్యక్తిని రాహుల్ ట్రావెల్స్ అనే ట్రావెల్ కంపెనీలో డ్రైవర్ 'దినేష్' గా స్థానిక మీడియా సంస్థలు గుర్తించాయి. తాను ట్రావెల్ కంపెనీలో పని చేసేవాడినని, ఈ ఏడాది మే, జూన్ నెలల జీతాలు అందలేదని దినేష్ తన పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నాడు. బకాయి డబ్బులు వసూలు చేసేందుకు కంపెనీ కార్యాలయానికి రాగానే, ఉద్యోగులు తనతో దురుసుగా ప్రవర్తించారని, వాగ్వాదానికి దిగారని ఆ వ్యక్తి చెప్పాడు. అతను మేనేజర్ నంబర్‌ను అడిగినప్పుడు, మహిళల గుంపు తనను కొట్టడం, దుర్భాషలాడడం ప్రారంభించిందని దినేష్ పేర్కొన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా పలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దినేష్ డిమాండ్ చేశాడు.