మానవత్వమే సిగ్గు పడే ఘటన చోటు చేసుకుంది. ఓ మనవడు తన అమ్మమ్మను చంపేశాడు. రాజస్థాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుంగార్‌పూర్ జిల్లాలోని నితౌవా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అమ్మమ్మ కాలుకు వెండి కంకణాలు దొంగిలించి ఆ డబ్బుతో మద్యం తాగాలని మనవడు అనుకున్నాడు. అమ్మమ్మ నిద్రిస్తున్న సమయంలో అతడు ఈ ఘటనకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అమ్మమ్మ పాదాల దగ్గర ఉన్న కంకణాలను తీయడానికి ప్రయత్నించగా, ఆమెకి మెలకువ వచ్చింది.
బామ్మ ప్రతిఘటించడంతో మనవడు ఆమె ముఖాన్ని బెడ్ షీట్‌తో నొక్కి గొంతుకోసి హత్య చేశాడు. నిందితుడు అక్కడితో ఆగకుండా.. వెండి కంకణాలు తీసి స్వర్ణకారుని వద్దకు తీసుకెళ్లి విక్రయించాడు. సంఘటన జరిగిన వెంటనే పోలీసులు మనవడితో పాటు అతని సహచరులలో ఒకరిని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు ఈ సంఘటనలో అతనికి ఇద్దరు సహాయం చేశారని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం మిగిలిన వారి కోసం వెతుకుతున్నారు.