గుంటూరులో విషాదం : ప్రేమించాలంటూ వేధింపులు.. త‌ట్టుకోలేక యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

Girl who attempted suicide due to harassment dies in Guntur. వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో

By Medi Samrat  Published on  9 Feb 2022 1:01 PM GMT
గుంటూరులో విషాదం : ప్రేమించాలంటూ వేధింపులు.. త‌ట్టుకోలేక యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

వేధింపులు తట్టుకోలేక ఓ బాలిక ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసి ప్రాణాలతో పోరాడి చికిత్స పొందుతూ మృతి చెందిన విషాద ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శ్యామలాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన పులుకూరి వెంకటాచారి, మల్లేశ్వరి దంపతుల రెండో కుమార్తె(18)ని అదే గ్రామానికి చెందిన చెన్నంశెట్టి నాగేంద్రబాబు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమికుడు నాగేంద్రబాబు నుంచి కూతురికి రక్షణ కల్పించాలని ఆమె తల్లిదండ్రులు రెండు నెలల క్రితం ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంపరాల గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి పంపించారు.

అయితే యువతి సోదరి వివాహం కావడంతో ఈ నెల 1వ తేదీన స్వగ్రామానికి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నాగేంద్రబాబు, ఆయన తాత పత్తి శ్రీను, బావ అనిల్‌తో కలిసి వెంపరాల గ్రామానికి వెళ్లారు. యువతిని బలవంతంగా అక్కడి నుండి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తండ్రి వెంకటాచారి వెంపరాల‌ వెళ్లి తన కుమార్తెను శానంపూడి గ్రామానికి తీసుకొచ్చారు.

యువతి గ్రామానికి వచ్చిందని తెలుసుకున్న ప్రేమికుడు నాగేంద్రబాబు.. ఆమె ఇంటికి వెళ్లి తండ్రి వెంకటాచారిపై దాడి చేశాడు. నాగేంద్రబాబు తన తండ్రి, తమ్ముడిని బెదిరించడంతో భయాందోళనకు గురైన యువతి ఈ నెల 2న ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆమెను వినుకొండ పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా 7 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామంలో విశ్వబ్రాహ్మణకు చెందిన ఇల్లు ఒక్కటే కావడంతో వేధింపులకు గురిచేస్తున్నారని మృతురాలి తల్లిదండ్రులు విలపించారు. ఈ ఘటనపై శావల్యాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Next Story
Share it