బాయ్ ఫ్రెండ్‌తో జీవితాంతం క‌లిసి ఉండాల‌ని ఇంటి నుండి వెళ్లిపోయిన‌ యువతి.. ఘోరం ఊహించలేదు..

Girl ran away with her boyfriend, police found the body. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గురువారం పొదల్లో ఛిద్రమైన మహిళ మృతదేహం

By Medi Samrat  Published on  5 Feb 2022 8:18 PM IST
బాయ్ ఫ్రెండ్‌తో జీవితాంతం క‌లిసి ఉండాల‌ని ఇంటి నుండి వెళ్లిపోయిన‌ యువతి.. ఘోరం ఊహించలేదు..

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో గురువారం పొదల్లో ఛిద్రమైన మహిళ మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై-అహ్మదాబాద్ హైవేపై వాఘోబా ఖిండ్ వద్ద పొదల్లో మహిళ మృతదేహం లభ్యమైందని పోలీసు అధికారి తెలిపారు. మృతి చెందిన మహిళను 28 ఏళ్ల కరోల్ మెస్క్విటా అలియాస్ పింకీగా గుర్తించారు. ఆమె హత్య కేసులో పింకీ ప్రియుడు 27 ఏళ్ల జికో మెస్క్విటా, అతని స్నేహితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనవరి 24 నుంచి పింకీ కనిపించకుండా పోయిందని తెలిపారు. చెక్ అప్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లాలని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తన ప్రియుడు జికోతో కలిసి స్కూటర్‌లో కూర్చొని ఎక్కడికో వెళ్లిపోయిందని తెలుస్తోంది. వారిద్దరూ వాఘోబాకు చేరుకోగానే వారి మధ్య ఏదో విషయమై గొడవ జరిగింది. తనను పెళ్లి చేసుకోవాలని పింకీ పట్టుపడుతోందని జికో పోలీసులకు తెలిపాడు. దీంతో గొడవ తీవ్రస్థాయికి చేరడంతో ఆవేశానికి లోనైన జికో కత్తితో పింకీ గొంతుపై దాడి చేశాడు. అతని స్నేహితుడు దేవేంద్ర సహాయంతో జికో పింకీ మృతదేహాన్ని అక్కడి పొదల్లోకి విసిరి వేశాడు. తర్వాత ఇద్దరూ ఇంటికి తిరిగొచ్చారు. పింకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆచూకీ కోసం ప్రయత్నించారు. ఆమె ఎక్కడా కనిపించకపోవడంతో, రెండు రోజుల తర్వాత వారు బాంద్రా పోలీస్ స్టేషన్‌లో పింకీ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తూ ఉన్నారు.


Next Story