ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బిలాస్‌పూర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరంలోని పాఠశాల వాష్‌రూమ్ గోడ ఒక భాగం కూలిపోవడంతో ఏడేళ్ల బాలిక మంగళవారం మృతి చెందింది. ఈ విషయాన్ని అక్కడి స్థానిక పోలీసులు తెలిపారు. మృతురాలు సర్కంద పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతాంజలి సిటీ ఫేజ్-2 ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో 2వ తరగతి చదువుతున్న బాలిక అని సర్కంద స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) పరివేష్ తివారీ తెలిపారు. బాలిక తన పాఠశాలలోని వాష్‌రూమ్‌లోకి ప్రవేశించిన వెంటనే గోడలోని ఒక భాగం మధ్యాహ్నం కూలిపోయిందని ఎస్‌హెచ్‌వో తెలిపారు.
ఈ ప్రమాదంలో బాలిక తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. పాఠశాలలోని ఉపాధ్యాయులు బాలికను నగరంలోని ఛత్తీస్‌గఢ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆమె చనిపోయినట్లు నిర్ధారించారని ఆయన తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదుపై నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పాఠశాల డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తివారీ తెలిపారు. పాఠశాలలోని బాత్‌రూమ్ పైకప్పు లేకుండా శిథిలావస్థకు చేరినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని తెలిపారు. రాష్ట్ర పీడబ్ల్యూడీ విభాగం కూడా నిర్ణీత ప్రమాణాల ప్రకారం గోడ నిర్మించారా లేదా అని అంచనా వేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.