పెరోల్‌పై బయటికొచ్చాడు.. జైలుకు వెళ్లకుండా ఉండేందుకు మరణం పేరుతో స్కెచ్.. కానీ దొరికిపోయారు..!
Ghaziabad Police arrests man for faking death to avoid going back to jail. హత్యకేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు మరణం పేరుతో
By Medi Samrat Published on 12 Dec 2021 12:55 PM IST
హత్యకేసులో జైలుకు వెళ్లకుండా ఉండేందుకు మరణం పేరుతో బూటకపు కథనానికి పాల్పడిన వ్యక్తిని ఘజియాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడు ఢిల్లీ నివాసి అయిన సుధేష్ కుమార్ ను.. అతనికి సహకరించిన అతని భార్య అనుపమను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 20న లోని ప్రాంతంలో మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహం కాలిపోయి గుర్తుపట్టలేకుండా ఉంది. మృతదేహం జేబులోంచి సుదేష్‌కుమార్‌కు చెందిన ఆధార్ కార్డు లభించింది. మృతదేహాన్ని గుర్తించేందుకు అనుపమను పోలీసులు పిలిపించగా, అది తన భర్తదేనని పేర్కొంది.
అయితే.. అనుపమ ప్రకటనపై పోలీసులకు అనుమానం వచ్చిందని రూరల్ పోలీసు సూపరింటెండెంట్ ఇరాజ్ రాజా తెలిపారు. దీంతో సుదేష్ కుమార్ చరిత్రను తవ్విచూడగా.. అతను 2018లో తన 13 ఏళ్ల కుమార్తెను హత్య చేసినందుకు జైలుకెళ్లారని కనుగొన్నారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది మేలో సుధేష్‌ను పెరోల్‌పై విడుదల చేసినట్లు ఎస్పీ రాజా తెలిపారు. ఇప్పుడు.. అతని పెరోల్ ముగియడంతో తిరిగి జైలుకు వెళ్లకుండా ఉండటానికి తన భార్యతో కలిసి ఈ పథకం వేశాడు.
పథకంలో భాగంగా.. సుదేశ్ తన ఇంటిలో మరమ్మతు పనులు చేసేందుకు దోమన్ రవిదాస్ అనే కూలీని పిలిచాడు. తన బట్టలు వేసుకోవడానికి ఇచ్చాడు. రెండో రోజు రవిదాస్ తన ఇంటికి పనికి వచ్చినప్పుడు.. సుదేష్ అతనికి బాగా మద్యం తాగించాడు, దీంతో రవిదాస్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఆ తర్వాత రవిదాస్‌ను హత్య చేసి.. తలను చితకబాది.. మృతదేహాన్ని సులభంగా గుర్తించలేని విధంగా కాల్చివేసి.. ఆ తర్వాత సుదేష్ మృతదేహాన్ని లోని అనే ప్రాంతంలో విసిరేశాడు. పథకం ప్రకారం.. మృతుడు రవిదాస్ ను తన భర్తగా సుధేష్ భార్య గుర్తించింది. అయితే.. మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు రవిదాస్ కుటుంబీకులను పిలిపించడంతో దంపతుల పథకం బయట పడింది. దీంతో భార్యాభర్తలిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.