విషాదం.. స్కూల్ వ్యాన్ కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి
హైదరాబాద్ పెద్ద అంబర్పేట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది.
By Medi Samrat Published on 6 Feb 2025 5:48 PM IST
హైదరాబాద్ పెద్ద అంబర్పేట్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగు సంవత్స రాల బాలిక స్కూల్ వ్యాన్ చక్రాల కింద పడి మృతి చెందింది. పెద్ద అంబ ర్పేట్ పరిధి ఎల్బీనగర్‌కు చెందిన రిత్విక(4) అనే బాలిక హయత్‌నగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతుంది. రోజులాగే గురువారం కూడా స్కూల్‌కు వెళ్లిన రిత్విక.. స్కూల్ అయిపోయిన తర్వాత వ్యాన్‌లో ఇంటికి బయలుదేరింది. స్కూల్ వ్యాన్ ఇంటి వద్దకు రాగానే రిత్విక తన బ్యాగ్ తీసుకొని దిగి ఇంటికి వెళ్లే క్రమంలో స్కూల్ వ్యాన్ రివర్స్‌లో రిత్వికను ఢికొట్టింది. దీంతో రిత్విక వ్యాన్ చక్రాల కింద పడింది. అది గమనించిన డ్రైవర్ ఒక్కసారిగా వ్యాన్ ఆపాడు.. కానీ అప్పటికే రిత్విక మృతి చెందింది. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే బాలిక మృతిచెందిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు స్కూల్ వ్యాన్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చరికి తరలించారు.