పరువు తీసిందని పెద్ద కోడలిని.. మామ, మరుదులు కలిసి..
Four suspects arrested in woman murder case. కర్నూలు జిల్లా చింతకుంట గ్రామంలో ఇంటి పెద్ద కోడలిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను
By అంజి Published on 2 Nov 2021 4:08 AM GMTఅక్టోబర్ నెల 15వ తేదీన కర్నూలు జిల్లా చింతకుంట గ్రామంలో ఇంటి పెద్ద కోడలిని హత్య చేసిన ఘటనలో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట గ్రామానికి చెందిన ఎర్రిస్వామికి నలుగురు కొడుకులు. 10 ఏళ్ల కిందట పెద్ద కొడుకు వన్నప్పకు అర్ధగేరికి చెందిన సువర్ణమ్మతో పెళ్లి జరిగింది. వీరికి ఎలాంటి సంతానం కాలేదు. ఇటీవల కుటుంబ కలహాలు ఎక్కువ అయ్యాయి. మామ ఎర్రిస్వామి, మరిది సుంకన్నలు తనను వేధిస్తున్నారని సువర్ణమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమ కుటుంబ పరువు తీసిందని సువర్ణమ్మపై కక్ష పెంచుకున్నారు. ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది దసరా పండుగ రోజు సువర్ణమ్మ భర్త వన్నప్ప బన్ని ఉత్సవానికి దేవరగట్టుకు వెళ్లాడు.
అదే రోజు అర్థరాత్రి సమయంలో మామ ఎర్రిస్వామి, మరుదులు సుంకన్న, బ్రహ్మయ్య హనమంతులు కలిసి ఇంట్లో నిద్రిస్తున్న సువర్ణమ్మను గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని కర్ణాటక రాష్ట్రంలోని వీరాపురం రైల్వే ట్రాక్‌పై పడేశారు. తెల్లారి సువర్ణమ్మ కనిపించట్లేదని భర్త వన్నప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మూడు రోజుల తర్వాత రైల్వై గుర్తు తెలియని మృతదేహం కనిపించడంతో.. హత్య చేసి పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో తన తండ్రి, తమ్ముళ్లపై వన్నప్ప అనుమానం వ్యక్తం చేశాడు.. దీంతో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తామే హత్య చేసినట్లుగా నిందితులు ఒప్పుకున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల రిమాండ్‌లో ఉన్నారు.