ఒకే ఇంట్లో నలుగురి దారుణహత్య
Four Murdered In Punjab. పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని మయూర్ విహార్ కాలనీలో దారుణం జరిగింది.
By Medi Samrat Published on 24 Nov 2020 10:51 AM GMT
పంజాబ్ రాష్ట్రం లూథియానాలోని మయూర్ విహార్ కాలనీలో దారుణం జరిగింది. రాజీవ్ సూద్ అనే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో అతని కుటుంబసభ్యులు నలుగురు దారుణహత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు రాజీవ్ సూద్ భార్య సునీత, కొడుకు అశీష్, కోడలు గరిమతో పాటు అతని 13 ఏళ్ల మనవణ్ని దారుణంగా హతమార్చారు. నలుగురినీ గొంతు కోసే చంపేశారు. సోమవారం రాత్రి ఈ హత్యలు జరిగినట్లు తెలుస్తున్నది.
మంగళవారం ఉదయం గరిమ తండ్రి తన కూతురును చూసేందుకు వెళ్లగా లోపలి నుంచి గడియవేసి ఉన్నది. ఎంత పిలిచినా లోపలి నుంచి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారికి సమాచారం ఇచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అక్కడికి చేరుకుని తలుపులు విరగ్గొట్టి చూడగా నలుగురు రక్తపు మడుగులో పడి ఉన్నారు. అయితే ఆ ఇంటి యజమాని రాజీవ్ సూద్ జాడ లేదు. దుండగులు కుటుంబసభ్యులను చంపి రాజీవ్‌ను ఎత్తుకెళ్లారా లేదంటే ఏదైనా కారణాలతో రాజీవే కుటుంబసభ్యులను హత్యచేసి పారిపోయాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.