మూడు అంతస్థుల భవనంలో చెలరేగిన మంటలు.. మహిళ సహా 3 చిన్నారులు దుర్మరణం
యూపీలోని ఘజియాబాద్ లోని కొత్వాలి ప్రాంతంలోని కంచన్ పార్క్ కాలనీలో మూడు అంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి.
By Medi Samrat Published on 19 Jan 2025 10:44 AM ISTయూపీలోని ఘజియాబాద్ లోని కొత్వాలి ప్రాంతంలోని కంచన్ పార్క్ కాలనీలో మూడు అంతస్తుల ఇంట్లో మంటలు చెలరేగాయి. మూడో అంతస్తులో ఉన్న ఓ మహిళ, ముగ్గురు పిల్లలు, మరో నలుగురు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గోడను పగులగొట్టి తీవ్రంగా గాయపడిన ముగ్గురు చిన్నారులు, ఒక మహిళను ఆస్పత్రికి తరలించారు. అక్కడ నలుగురు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి.
ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కంచన్ పార్క్ చౌకీ ఏరియా పట్టణంలోని నివాస ప్రాంతంలోని మూడు అంతస్తుల ఇంట్లో అగ్నిప్రమాదం గురించి లోని ఏరియా పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న వెంటనే లోని పోలీసులు.. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడంతస్తుల ఇల్లు మొత్తం మంటలు వ్యాపించినట్లు అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. వెంటనే మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. చీఫ్ ఫైర్ ఆఫీసర్ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 500 మీటర్ల మేర హోస్ పైపును ఏర్పాటు చేసి మంటలను ఆర్పే పని ప్రారంభించారు. సమీపంలోని ఇంటి నుంచి మూడంతస్తుల భవనంలోకి వెళ్లడానికి గోడ పగులగొట్టారు. దీని తరువాత లోపల చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించారు. ఇందులో ఊపిరాడక, కాలిన గాయాలతో ముగ్గురు చిన్నారులు, ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. వారిని ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నలుగురూ చనిపోయారు. మంటల కారణంగా ఇంట్లోకి వెళ్లే మార్గం లేదని చీఫ్ ఫైర్ ఆఫీసర్ రాహుల్ పాల్ తెలిపారు.
మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పక్క ఇంటి నుంచి మూడో అంతస్తుకు చేరుకున్నారు. గోడ పగులగొట్టి ఇంట్లో చిక్కుకున్న వారిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక విచారణలో అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని తేలింది.