ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి

ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో న‌లుగురు మరణించారు.

By -  Medi Samrat
Published on : 29 Dec 2025 4:50 PM IST

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం.. న‌లుగురు మృతి

ఖమ్మం జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో న‌లుగురు మరణించారు. మరో యువ‌కుడు తీవ్రంగా గాయపడ్డాడు. తల్లాడ మండంలోని మిట్టపల్లి వద్ద కల్లూరు నుంచి తల్లాడ వైపు వెళ్తున్న కారు.. తల్లాడ నుంచి కల్లూరు వైపు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ద‌ట్ట‌మ‌మైన మంచు కార‌ణంగా దృశ్యమానత సరిగా లేకపోవడమే ప్రమాదానికి కారణమని అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న తల్లాడ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కారులో ఇరుక్కుని మృతి చెందిన వారి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ప్ర‌మాదంలో కారు నుజ్జునుజ్జ‌య్యింది. కారులో ఉన్న వ్యక్తులు ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయానికి వెళ్లి తీర్థయాత్ర ముగించుకుని తిరిగి వస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కారు డ్రైవర్ చిల్లర బాలకృష్ణ, రాయల అనిల్‌లు జనగాం జిల్లా జఫర్‌గఢ్‌కు చెందిన వారు. తీవ్రంగా గాయపడిన రాకేష్, క్రాంతిలను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ వారిద్దరూ కూడా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మరో స్నేహితుడు అజయ్ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. వీరు కూడా అదే జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఉప్పుగల్లు గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు.

Next Story