జార్ఖండ్ రాష్ట్రం హౌరా-న్యూఢిల్లీ రైలు మార్గంలోని ధన్‌బాద్ గోమో మధ్య నిచిత్‌పూర్ రైలు గేట్ వద్ద 25,000 వోల్టుల హైటెన్షన్ విద్యుత్ వైర్ తెగి పడిపోవడంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. కల్కా నుంచి హౌరా వెళ్తున్న నేతాజీ ఎక్స్‌ప్రెస్‌ను టెతుల్‌మారీ స్టేషన్‌లో నిలిపివేశారు. హౌరా నుంచి బికనీర్ వెళ్లే ప్రతాప్ ఎక్స్‌ప్రెస్‌ను ధన్‌బాద్ స్టేషన్‌లో నిలిపివేశారు. రైల్వే అధికారులు, వైద్యులు రోడ్డు మార్గంలో సంఘటనా స్థలానికి బయలుదేరారు. ధన్‌బాద్ నుండి యాక్సిడెంట్ రిలీఫ్ మెడికల్ వ్యాన్ ఘటనా స్థలానికి చేరుకుంది.
ఘటనకు సంబంధించిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ధన్‌బాద్ రైల్వే డివిజన్‌లోని ప్రధాన్‌ఖాంట నుండి బంధువా వరకు దాదాపు 200 కి.మీ రైలు మార్గంలో రైళ్ల వేగాన్ని గంటకు 120 నుండి 160 కి.మీలకు పెంచే పని జరుగుతోంది. సోమవారం రైల్వే టీఆర్‌డీ విభాగం తరఫున నిచిత్‌పూర్ హాల్ట్ రైలు గేటు సమీపంలో స్తంభం ఏర్పాటు పనులు చేపట్టారు. పనులు జరుగుతుండగా ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.