మీ కల నెరవేర్చలేక‌పోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య

కోటాలో రోజురోజుకు ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్ధుల‌ సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది.

By Medi Samrat  Published on  6 March 2025 10:53 AM IST
మీ కల నెరవేర్చలేక‌పోతున్నాను.. క్షమించండి.. కోటాలో మరో MBBS విద్యార్థి ఆత్మహత్య

కోటాలో రోజురోజుకు ఆత్మహత్య చేసుకుంటున్న విద్యార్ధుల‌ సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్‌లోని కోటాలో మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. గత మూడేళ్లుగా కోటాలో ఉంటున్నాడు. ఆత్మ‌హ‌త్య‌పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని మార్చురీలో ఉంచారు. పోలీసులు విద్యార్థి సూసైడ్ నోట్ కూడా స్వాధీనం చేసుకున్నారు.

మృతుడి గదిలో పోలీసులు సూసైడ్ నోట్‌ను కనుగొన్నారు. అందులో అత‌డు.. తల్లిదండ్రుల కలలను నెరవేర్చలేకపోతున్నాన‌ని వారికి క్షమాపణలు చెప్పాడు. మహావీర్ నగర్ సీఐ రమేష్ కావియా తెలిపిన వివరాల ప్రకారం.. బస్సీ నివాసి సునీల్ బైర్వా (28) కోట మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం అతడు కనిపించకపోవడంతో హాస్టల్‌లో అతనితో పాటు ఉంటున్న అబ్బాయిలు రాత్రి అతని గదిలో చూడగా ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు మహవీర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు.

సమాచారం ప్రకారం కోటాలో ఈ ఏడాది ఇది 8వ‌ ఆత్మహత్య. అంతకుముందు ఫిబ్రవరి 11వ తేదీన కోటాలో నీట్ విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి పేరు అంకుష్ మీనా. 18 ఏళ్ల మీనా ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయమై పోలీసులు విచారణ జరిపి అత‌డి మృతికి చదువులో ఒత్తిడి కారణం కాదని పేర్కొన్నారు. కొన్ని వ్యక్తిగత కారణాల వల్లే అతడు ఆత్మ‌హ‌త్య చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Next Story